Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల పెంపు, వివరాలివే
Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల పెంపు, వివరాలివే
Hyderabad Metro Rail Services Increased: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.. సర్వీసులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో 56 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు సూచించారు.
హైలైట్:
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
హైదరాబాద్ మెట్రో అధికారుల కీలక నిర్ణయం
మెట్రో సర్వీసుల సంఖ్య పెంచుతూ ప్రకటన
Hyderabad Metro Rail Services
హైదరాబాద్ మెట్రో సర్వీసులు పెంపు
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలోకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో ఇబ్బందిపడుతున్న ప్రయాణికుల కోసం మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో సర్వీసుల్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్‌లో ఇకపై 4 నిమిషాలకో మెట్రో రైలు.. నాగోల్‌టు రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో రైలు నడపనున్నారు. ప్రయాణికులు మెట్రో సర్వీసుల్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌పై ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపిస్తోంది.. నగరంలో బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్టీసీ ప్రస్తుతానికి నగరంలోని పలు ప్రాంతాల్లో అద్దె బస్సులను నడుపుతోంది.. వీటిలో కండక్టర్ కూడా లేకుండా సర్వీసుల్ని తిప్పుతోంది. నగరంలో బస్సులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండటంతో ఇదే ఛాన్స్ అన్నట్లుగా వారు కూడా అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే మెట్రో సర్వీసుల్ని పెంచడంతో కొంత ఊరట దక్కనుంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి సమ్మెకు దిగారు. బస్సులు మొత్తం డిపోల్లోనే ఉండిపోయాయి.. డిపోల దగ్గర ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రభావం కనిపిస్తోంది.. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది సొంత వాహనాలను బయటకు తీయగా.. మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 32 డిమాండ్లలో 29 పరిష్కరిస్తామని.. ఆర్టీసీ విలీనంతో పాటుగా గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాల గురించి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో చర్చిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ కమిటీని నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. సమ్మెతో సమస్యలు పరిష్కారం కావని.. ఆర్టీసీ భవిష్యత్, ప్రజల శేయస్సును దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని దశవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.