పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్
పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ లీటర్ల పెట్రోల్‌ను పోసినట్లు.. బంక్ సిబ్బంది బిల్లు రశీదు ఇవ్వడంతో ఓనర్ ఖంగుతిన్నాడు. అలా ఎలా పోస్తారని బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ కారు ఓనర్.. సంబంధిత అధికారులు పట్టించుకుని, ఇలాంటి మోసాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు.
హైలైట్:
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం
27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు వెల్లడి
హైదరాబాద్‌లో వెలుగులోకి పెట్రోల్ బంక్ మోసం
petrol bunk
27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్
పెట్రోల్ బంకుల్లో రకరకాల మోసాలు జరుగుతాయని ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు, ఘటనలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను అడ్డుకోవాలని చాలా మంది బాధితులు.. అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా మోసం.. వాహనదారులకు సరికొత్త భయాలను రేకెత్తిస్తోంది. అసలు కారు ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ పెట్రోల్ అందులో ఎలా పడుతుంది అంటూ ఓనర్ ప్రశ్నించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఇప్పటివరకు పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్, డీజిల్‌లలో కల్తీ, నీళ్లు రావడం వంటి మోసాలు చూశాం. మరికొన్ని పెట్రోల్ పంపుల్లో రీడింగ్ ఎక్కువ, తక్కువ చూపించి పెట్రోల్, డీజిల్ కొడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో కారు యజమానికి బిగ్ షాక్ తగిలింది. తన కారులోని 27 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఫుల్ చేయాలని సిబ్బందికి చెప్పగా.. అందులో 29.5 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు తెలిపారు. అయితే అప్పటికే ఆ కారులో 2, 3 లీటర్ల పెట్రోల్ ఉందని.. దీంతో 27 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్ ఎలా నింపారని బంక్ సిబ్బందిని ఆ కారు ఓనర్ నిలదీశాడు.
ఈ క్రమంలోనే తన కారులో నింపిన పెట్రోల్‌ను బయటికి తీసి కొలవాలని డిమాండ్ చేశాడు. అయితే పెట్రోల్ బంకు సిబ్బంది 5 లీటర్ల క్యాన్లతో పెట్రోల్‌ను కొలుస్తామని చెప్పారని.. అలా కాకుండా మెజరింగ్ సిలిండర్‌తోనే కొలవాలని అతడు వాదించాడు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బందికి, కారు ఓనర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పెట్రోల్ బంకులో ఎలాంటి సమస్య లేదని.. సమస్య అంతా కారులోనే ఉందని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మెకానిక్ వద్దకు వెళ్లి కారును చూపించుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.
గట్టిగా నిలదీస్తే పెట్రోల్ బంకు సిబ్బంది.. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవాలని చెబుతున్నారని కారు ఓనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి పెట్రోల్ బంకుల్లో ఇలాంటి మోసాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి.. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేశాడు. ఇక ఈ పెట్రోల్ మోసం వెలుగులోకి రావడంతో వాహనదారుల్లో సరికొత్త భయం నెలకొంది.