కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పరీశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా రెండు విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది, రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని తీసుకొచ్చిందని కూడా గుర్తు చేశారు. అదే సమయంలో దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించామని చెప్పిన సీఎం.. 2029 ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా ఇదే తన సవాల్ అంటూ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వో, నేనో తేల్చుకుందాం అంటూ కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.
ఇక ప్రజాపాలన పోవాలి అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. పాపాల భైరవుడు రావాలి అంటున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్‌లో ఉండే పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోస్తే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఎందుకు పాపాల భైరవుడు రావాలో.. పార్టీ మారిన జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. జీవన్‌రెడ్డి చరిత్ర, ఆయన వెనక ఉన్న మచ్చలు అన్నీ తనకు తెలుసని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
40 ఏళ్లుగా తనకు, తన కుటుంబానికి జీవన్ రెడ్డి ఎన్నో పదవులను తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ ఫామ్ ఇస్తే.. ఇప్పుడు పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారని ఆరోపించారు. ఓడిపోయినా ఎన్నోసార్లు పదవులు, టికెట్లు ఇచ్చి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ గౌరవించిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల గుండెలమీద తన్ని జీవన్‌రెడ్డి శత్రువు వైపు చేరారని మండిపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగులకు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. ఒక్కరికి పదవి రాకపోతే.. ప్రజా ప్రభుత్వం పోవాలా అని నిలదీశారు. నేరెళ్లలో ఇసుక లారీలతో తొక్కించి ఎస్సీలను చంపినందుకు పాపాల భైరవుడు మళ్లీ రావాలా అన్నారు. వాస్తు కోసం బాగున్న సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది కట్టారని.. తండ్రి, కొడుకు, బిడ్డ ఇలా ముగ్గురూ ఫామ్‌హౌస్ కట్టుకున్నారని.. కానీ పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా అని నిలదీశారు.
దొరల గడీల ముందు పేదలు ఊడిగం చేస్తూ ఇప్పటికీ అలాగే ఉండాలని భావించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కట్టుకోవడానికి పనికిరాని బతుకమ్మ చీరలను గత ప్రభుత్వంలో పేదలు పంచారని సీఎం ఆరోపించారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారని.. కానీ 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చేసి చూపించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రుణమాఫీ పథకం కింద రాష్ట్రంలోని 25.35 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.22 వేల కోట్లు జమ చేశామని ప్రకటించారు. గతంలో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేసినట్లు తెలిపారు. తాజాగా రెండో విడతలో భాగంగా రూ.5,700 కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. మిగిలిన రూ.3,300 కోట్ల నిధులను వచ్చే నెలలో ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.