ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు

 ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు

ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు

తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఓఆర్ఎస్ పంపిణీ ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

హైలైట్:
సెగలు కక్కుతున్న భానుడు
45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

Telangana Heatwave Alert

తెలంగాణలో భానుడు భగ్గమంటున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని 45 డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు నమోదవుతాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నేడు వడగాలులు వీచే అవకాశముందన్నారు.

బుధవారం (ఏప్రిల్ 15) రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్‌ జిల్లా తానూరులో 43.5 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్, మంచిర్యాల జిల్లా భీమారం, నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వైద్యారోగ్యశాఖ సూచనలు జారీ
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు, ప్రజలకు సూచిస్తూ వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది.

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరిగే అవకాశముందని.. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గ్రామస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రజలకు ఓఆర్‌ఎస్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు.

ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదన్నారు. బయటికి వెళ్లేటప్పుడు తలకు టోపీ, తువ్వాలు, గొడుగు వంటివి ధరించాలన్నారు.

దాహం వేయకపోయినా తరుచుగా తగినంత నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవాలన్నారు.
మసాలా, ఆయిల్‌ ఫుడ్‌ తినడం తగ్గించాలని తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలన్నారు.

శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, తల తిరగడం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *