అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్‌తో అధికార పార్టీ ఔట్.. !
అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్‌తో అధికార పార్టీ ఔట్.. !
తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉండేది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే.. కాంగ్రెస్ జెండా ఎగిరింది. కేసీఆర్ అనూహ్య ఓటమితో ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే చీఫ్ స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయనదే విజయం అని చెప్పాయి. కానీ స్టాలిన్ ఎమ్మెల్యేగానూ ఓడిపోయారు. ఈ రెండు ఫలితాలకు ముందు బీజేపీ ఆయా రాష్ట్రాల చీఫ్‌లను మార్చడం గమనార్హం.
హైలైట్:
BJP State Chief Change
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు
తమిళనాడులో డీఎంకే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే డీఎంకే ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు కొళత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీఎం స్టాలిన్.. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఏకంగా 9 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పార్టీ ఓటమి కంటే స్టాలిన్ ఓడిపోవడాన్ని డీఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ సోషల్ మీడియాలో ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు బీజేపీ తమ రాష్ట్ర అధ్యక్షుణ్ని మారిస్తే.. ఆ రాష్ట్రంలో అధికార మార్పు జరుగుతుందనేది ఈ పోస్టు సారాంశం. ఇంతకు ముందు తెలంగాణలో, ఇప్పుడు తమిళనాడులో ఇదే జరిగిందని చెబుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ లో బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీ దూకుడు మీద ఉంది. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు 2023 జులై 4న సంజయ్‌ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బండిని తప్పించిన తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. అప్పటి వరకూ బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించి.. రెండో స్థానంలో ఉన్నట్టు కనిపించిన కమలం పార్టీ వేగంగా కిందకు జారింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైంది. తెలంగాణలో బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
తమిళనాడులోనూ ఇదే తరహాలో బీజేపీ వ్యవహరించింది. తమిళనాట బీజేపీ పుంజుకోవడానికి శక్తికి మించి శ్రమిస్తోన్న అన్నామలైను.. 2026 ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ను నూతన అధ్యక్షుడిగా నియమించింది. అన్నాడీఎంకేతో పొత్తు కోసమే అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. అన్నామలై విషయంలో పళనిస్వామి సౌకర్యంగా లేకపోవడం వల్లే ఈ మార్పు జరిగిందని చెబుతారు. దీనికి తగ్గట్టుగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజయం ఖాయమైన వేళ.. అన్నామలై వేసిన ట్వీట్లో పళనిస్వామి ప్రస్తావన తీసుకురాలేదు.
ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. దూకుడుగా వ్యవహరిస్తూ తమిళనాడులో బీజేపీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి నేతను ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించడం బీజేపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది.
తీరా చూస్తే తమిళనాడులోనూ అధికార మార్పిడి జరిగింది. డీఎంకే కూటమి అనూహ్యంగా భంగపాటుకు గురైంది. డీఎంకే ఓటమికి, బీజేపీ అధ్యక్ష మార్పుకు సంబంధం ఉందని చెప్పలేం. కానీ ఎన్నికల ముంగిట తెలంగాణతోపాటు తమిళనాడులోనూ బీజేపీ అధ్యక్షుణ్ని మార్చడం.. అధికార పార్టీలు ఇంటి ముఖం పట్టడానికి కారణమైంది.