Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.
rythu bharosa
మార్చి 22న రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉగాది కానుక ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 22వ రైతు భరోసా తొలివిడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలివిడత నిధుల విడుదల జరగనుంది. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేస్తారు. తొలివిడతలో అర్హులైన 70 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.3,590 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది.
తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన 20 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. రెండో విడతలో రూ.2,650 కోట్లు రైతుల అకౌంట్లలో తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు రైతు భరోసా మూడో విడత నిధులు కూడా విడుదల చేయనుంది తెలంగాణ సర్కారు. మూడు విడతలు కలిపి మొత్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ప్రతి ఏటా ప్రభుత్వం అందిస్తోంది. రెండు దశలలో ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతుల కోసం ఇలాంటి పథకమే అమల్లో ఉంది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే ఎకరాలతో సంబంధం లేకుండా ఐదు ఎకరాలలోపు రైతులకు ఏటా రూ.20000 అందిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ.14 వేలు కాగా.. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందించే వాటా రూ.6000. మొత్తం మూడు విడతలలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇటీవలే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.