Podarillu Today మే 13 ఎపిసోడ్ : ఆ మాత్రం స్వేచ్ఛ లేదా?.. నారాయణపై మాధవ ఆగ్రహం.. చివరిసారిగా బావ చేతి వంటని రుచి చూసిన గాయత్రి
Podarillu Today మే 13 ఎపిసోడ్ : ఆ మాత్రం స్వేచ్ఛ లేదా?.. నారాయణపై మాధవ ఆగ్రహం.. చివరిసారిగా బావ చేతి వంటని రుచి చూసిన గాయత్రి

మా ఆయన్ను తీసుకు రావాలా..
నీకు బతకడం రాదు అని ఎవరైనా అంటే.. అసలు అనే వాళ్లు.. బతుకుతున్నది బతుకే కాదు అని చెప్పాలని ఉంది బావ అని గాయత్రి అంటుంది. ఒకటి అడగనా? ఆయన్ను ఈ ఇంటికి తీసుకు రావాలా? అని గాయత్రి అంటుంది. మీ వాళ్లు ఒప్పుకోరు కదా? అని పెద్ది అంటే.. వాళ్లని ఎవరు అడుగుతారు.. నువ్వు ఓకే అంటే ఆయన్ను తీసుకుని వస్తాను అని గాయత్రి అంటుంది. సరే.. ఇద్దరూ కలిసి భోజనానికి రెండి అని మాధవ చెబుతాడు. సరే బావ అని వెళ్లిపోతుంది గాయత్రి.
కన్నా కంగారు..
ఇంట్లో ఇద్దరూ కనిపించకపోయే సరికి కన్నా కంగారు పడిపోతాడు. ఇక దీంతో కేశవ, చక్రి, మహా అందరూ వచ్చేస్తారు. ఇక ఇంతలో చక్రి, యూనివర్సిటీ మేడం మ్యాటర్ని మహా తీస్తుంది. ఆ మ్యాటర్ ఏంటి? అని కేశవ, కన్నా అడుగుతారు. తరువాత చెబుతాను లే.. ముందు పెద్ది మ్యాటర్ చూద్దాం అని అడిగే లోపు మాధవ బయటకు వస్తాడు. మీరంతా ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు పెద్ది. సర్టిఫికెట్స్ వచ్చాయి.. ఇకపై అంతా మంచే జరుగుతుంది అని మహాకి పెద్ది కంగ్రాట్స్ చెబుతాడు. అందరూ మహాకి కంగ్రాట్స్ చెబుతారు. ఉద్యోగం వస్తే ఇంట్లోంచి వెళ్లిపోతుందేమో అని చక్రి లోలోపల భయపడిపోతాడు.
భోజనానికి రమ్మన్నాను..
ఇంటికి ఎవరు వచ్చారు.. దాన్ని ఎందుకు రానిచ్చావ్.. దానికి అసలు బుద్ది లేదా? అని కేశవ అంటుంటాడు. ఏయ్ అలా మాట్లాడకురా అని పెద్ది అంటాడు. దానికి ఇప్పుడు మేం మర్యాద ఇవ్వాలా? అని కేశవ అంటే.. అవును.. ఇప్పుడే ఇవ్వాలి.. ఒకప్పటి గాయత్రి కాదు.. మీ మరదలు కాదు.. మీతో ఆడుకున్న ఆ గాయత్రి కాదు.. ఒకరి భార్య.. ఇప్పుడే గౌరవం ఇవ్వాలి, పెద్దిలానే గాయత్రి కూడా ప్రేమను త్యాగం చేసింది అంటూ మహా క్లాస్ పీకుతుంది. ఇద్దర్నీ కలిసి భోజనానికి రమ్మని చెప్పానంటూ మాధవ వెళ్లిపోతాడు.
ఇంట్లో రకరకాల వంటలు..
భోజనానికి చాలానే వెరైటీలు చేస్తున్నావ్ అన్నయ్య అని కన్నా అంటాడు. మరో వైపు చక్రి, కేశవ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చెడగొట్టేవాళ్లని చూశా గానీ.. ఇలా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తానంటే వడ్డించే వ్యక్తిని, మహానుభావుడ్ని ఇక్కడే చూస్తున్నా అని చక్రి అంటాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చెడగొట్టే సన్నాసివి నువ్వే కదా? అని చక్రి మీద కేశవ కౌంటర్ వేస్తాడు. ఆ వంటల వాసనలు నారాయణకి వస్తాయి. లోపలకు వచ్చి అసలు విషయం అడుగుతాడు. గాయత్రి వస్తుందని తెలియడంతో నారాయణ ఫైర్ అవుతాడు.
పిలవడానికి నీకు సిగ్గు లేదా?
దానికి సిగ్గు లేకపోయినా, పిలవడానికి నీకు సిగ్గు లేదా? అని నారాయణ అంటాడు. కేశవ, చక్రి కూడా నారాయణకి వంత పాడుతారు. దాని తల్లి, తండ్రి వచ్చి అందరూ తిడతారు. ఏమ్మా.. నువ్వు వంటలక్కవి అయ్యావ్.. మా మీద అరుస్తావ్.. మీ పెద్దిని అనవా? పిల్లని అడగడానికి వెళ్తే నీ మీద ఎంత ఫైర్ అయ్యారు.. అని మహాకి గుర్తు చేస్తాడు నారాయణ. అది రాగానే ఏమైనా గొడవలు జరిగితే వీరభద్రుడ్ని అయిపోతా అని నారాయణ ఆగ్రహిస్తాడు. ఈ మాటలతో పెద్దికి కోపం వస్తుంది. గాయత్రికి పెళ్లి అయిపోయింది.. మా హద్దులు ఏంటో నాకు తెలుసు.. ఇంట్లో చెప్పే తీసుకు వస్తుంది.. అని పెద్ది అందరికీ క్లారిటీ ఇస్తాడు.
నాకు స్వేచ్ఛ లేదా?
ఈ ఇంట్లో నాకు నచ్చిన వాళ్లకి, చివరి సారిగా వడ్డించే స్వేచ్ఛ లేదా? అని పెద్ది ఫైర్ అవుతాడు. అది ఇక్కడకు వస్తే.. మొగుడితో గలగలా మాట్లాడుతూ ఉంటే తట్టుకునే గుండే నీకున్నా.. నా కొడుకుని అలా చూసి తట్టుకునే గుండె నాకు లేదురా అని చెప్పి వెళ్లిపోతాడు నారాయణ. మీలో ఇంకా ఎవరికైనా అభ్యంతరాలున్నాయా? అని పెద్ది అడుగుతాడు. ఈ ఇంటి పెద్దకే స్వేచ్ఛ లేదు అనేంత స్వేచ్ఛ మాకు లేదు అని చక్రి అంటాడు.. వచ్చిన వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటాం అని కేశవ అంటాడు.
మండిపడ్డ తాయారు..
అది వాళ్ల ఇంటికే వెళ్లి వాళ్లతో మాట్లాడి.. వెళ్లొస్తా అని చెప్పిందంటూ తాయారు మండిపడుతుంది. ఈ కాలం పిల్లల్ని అంతగా నమ్మొద్దు.. ఓ కంట కనిపెడుతూనే ఉండాలని పురుషోత్తంకి రమణయ్య చెబుతాడు. వీరంతా మాట్లాడుకుంటూ ఉండగానే.. నేను, ఆయన కలిసి బయటకు వెళ్తున్నాం అని గాయత్రి వచ్చి చెబుతుంది. అలా సంతోషంగా చెప్పడంతో ఇంత మార్పు ఏంటి అని తాయారు సంతోషిస్తుంది. బయటకు వెళ్తున్నారు.. సంతోషం అని తాయారు అంటుంది. కానీ ఆ బయటకు అనేది పెద్ది ఇంటికి అని తెలియడంతో తాయారు ఫైర్ అవుతుంది.
భర్తతో కలిసి గాయత్రి..
ఒసేయ్ మెంటల్ దానా.. మళ్లీ ఎందుకే అని అడుగుతుంది. బావ వాళ్లింట్లో భోజనం చేసి వచ్చేందుకు వెళ్తున్నాం అని గాయత్రి అంటుంది. అల్లుడు ఉన్నాడని ఆగుతున్నా అని పురుషోత్తం ఫైర్ అవుతాడు. ఏంటే.. మా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా? అని తాయారు అడుగుతుంది. మా ఆయనతో వెళ్తుంటే మీ పర్మిషన్ ఏంటి? అని గాయత్రి అంటుంది. అంటే అల్లుడికి అంతా చెప్పావా? అని తాయారు అడుగుతుంది. ఏం చెప్పలేదు అని గాయత్రి అంటుంది. మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం మీ ఆయనకి తెలిస్తే.. అని తాయారు అనేలోపు వినోద్ కూడా అక్కడికి వస్తాడు.
కవర్ చేసిన తాయారు..
మాధవ విషయం అదే.. ఇంటికి భోజనానికి పిలిచాడని గాయత్రి చెప్పింది.. అంటూ వినోద్ అంటాడు. వాడి ఇంటికి వెళ్లడం నాకు నచ్చలేదు.. అది నువ్వు చెబుతావా? నేను చెప్పాలా? అని గాయత్రిని తాయారు బెదిరిస్తుంది. నేను కూడా చెబుతాను.. మీరు ఎలా మోసం చేశారు అని గాయత్రి అంటుంది. ఏంటి మోసం అంటున్నారు అని వినోద్ మళ్లీ వచ్చి అడుగుతాడు. ఏం లేదు అల్లుడు గారు.. జాగ్రత్తగా వెళ్లి త్వరగా రండి అని చెబుతున్నాను అని తాయారు అంటుంది. ఇక వినోద్, గాయత్రి కలిసి మాధవ ఇంటికి వెళ్తారు.
పెరటి గుమ్మం నుంచి..
తన భర్తని గాయత్రి పెరటి గుమ్మం నుంచి తీసుకు వస్తుంది. ఇలా ఎందుకు వచ్చారు.. అని పెద్ది అడుగుతాడు. చిన్నప్పటి నుంచి ఇలానే వచ్చేది అంట కదా.. అందుకే ఇలానే తీసుకు వచ్చిందని వినోద్ చెబుతాడు. మొదటి సారి వచ్చారు కదా.. గుమ్మం నుంచి రండి అని పెద్ది అడుగుతాడు. పద.. మనం దొంగల్లా కాదు.. చుట్టాల్లా రావాలని గాయత్రిని తీసుకుని వెళ్తాడు. ఇక ఇంటి గుమ్మం నుంచి వస్తారు. వారికి అక్కడ నీళ్లు కూడా పెడతారు. నారాయణను వినోద్ పలకరిస్తే.. రండి.. లోపలకు వెళ్లండి అని మర్యాదగా లేచి నిలబడతాడు నారాయణ.
మీరంతా నాకు నచ్చారు..
వినోద్కి గాయత్రి అందరినీ పరిచయం చేస్తుంది. ఎంగేజ్మెంట్లో చూశాను కానీ.. పెళ్లికి ఎవ్వరూ రాలేదు అని వినోద్ అంటాడు. ఆ ఇంటికి, ఆ ఇంటికి ఏవో గొడవలున్నాయని తెలుసు అని వినోద్ అంటాడు. అవును.. అందుకే ఆ ఇంటి వాళ్లు ఈ ఇంటికి.. ఈ ఇంటి వాళ్లు ఆ ఇంటికి రారు, వెళ్లరు.. కానీ గాయత్రి మాత్రం ఎప్పుడూ మాతోనే కలిసి ఆడుకునేది.. అందుకే ఆ పెరటి గుమ్మం నుంచే నిన్ను కూడా తీసుకు వచ్చింది అని చక్రి మాటలు కలుపుతాడు. మీరు నిజంగా నాకు చాలా నచ్చారు అని అందరినీ మెచ్చుకుంటాడు వినోద్.
ధర్మాత్ముడు.. మా అన్నయ్యలా..
వంట అద్భుతంగా ఉంది.. మీరు ఎంత సౌమ్యంగా ఉన్నారో.. మీ వంట అంత కమ్మగా ఉంది అని వినోద్ అంటాడు. మా బావ చేసే ప్రతీ కూర నాకు ఇష్టం.. ఎప్పుడూ నాకు ఓ బాక్సులో పెట్టి ఇచ్చేవాడు అని గాయత్రి చెబుతుంది. ఇప్పుడు వెళ్లిపోతే మళ్లీ ఎప్పుడో.. నీ చేతి వంట రుచి చూసేది.. అని గాయత్రి అంటుంది. మీ అమ్మ ఎలా ఒప్పుకుందే ఇక్కడకు రావడానికి అని నారాయణ అంటాడు. మా ఆయన ఒప్పుకుంటే చాలు కదా? అని గాయత్రి అంటుంది. మా నాన్న గారు మాధవని ధర్మాత్ముడు అంటాడు.. మా అన్నయ్యలా అనిపిస్తాడు నాకు అని పెద్ది గురించి వినోద్ చెబుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.