స్క్రీన్‌షాట్ చూసి నమ్మకండి.. బక్రీద్ వేళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు
బక్రీద్ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని గొర్రెలు, మేకల వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల పేరిట మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫేక్ ఫోన్‌పే యాప్‌ల ద్వారా వ్యాపారులకు డబ్బులు పంపినట్లు స్క్రీన్లు చూపించి రూ.1.16 లక్షల విలువైన జీవాలను కేటుగాళ్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కొనుగోలుదారుల మొబైల్ స్క్రీన్లు నమ్మకుండా.. స్వంత ఖాతాల్లో నగదు జమ అయిందో లేదో చూసుకున్నాకే జీవాలను అప్పగించాలని సీపీ సూచించారు.
హైలైట్:
బక్రీద్ వేళ గొర్రెల వ్యాపారులకు అలర్ట్
ఫేక్ పేమెంట్ యాప్‌లతో కేటుగాళ్ల వల
హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సమీపిస్తున్న తరుణంలో భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారులు, విక్రయదారుల రద్దీతో ఎంతో సందడిగా మారాయి. అయితే ఈ పండుగ హడావుడిని కొందరు సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపుల పేరిట అమాయక, నిరక్షరాస్యులైన జీవాల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఒరిజినల్ యాప్‌లను పోలి ఉండే ఫేక్ ఫోన్‌పే వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను సృష్టించి వ్యాపారులకు నగదు సక్సెస్‌ఫుల్‌గా బదిలీ అయినట్లు స్క్రీన్‌పై నకిలీ యానిమేషన్ చూపిస్తూ నమ్మిస్తున్నారు. సంతల్లో ఉండే విపరీతమైన రద్దీ, గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని, తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజంగానే డబ్బులు జమ అయ్యాయో లేదో సరిచూసుకోని అమాయక వ్యాపారులకు ఈ కేటుగాళ్లు దారుణంగా టోకరా వేస్తున్నారు.
తాజాగా.. హైదరాబాద్ కమిషనరేట్ కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు వెలుగులోకి వచ్చినట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ. 68 వేలు చెల్లించినట్లు నకిలీ యాప్ ద్వారా స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్లిపోయారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్రనగర్‌లోనూ నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి ఇదే తరహాలో నకిలీ పేమెంట్ యాప్‌తో మోసగించినట్లు చెప్పారు. బాధితులు ఆలస్యంగా తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా నగదు పంపినప్పుడు, కేవలం కొనుగోలుదారుడి ఫోన్‌లో కనిపించే స్క్రీన్ షాట్‌ను లేదా పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్‌ను చూసి నమ్మవద్దని సూచించారు. మీ స్వంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక ఎస్‌ఎమ్ఎస్ చూసుకోవాలని లేదా నేరుగా బ్యాంకింగ్ యాప్ తెరిచి బ్యాలెన్స్ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలన్నారు. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు నగదు రూపంలో తీసుకోవడమే ఉత్తమమని అంటున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మోసం చేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.