తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే
Tirumala Hyderabad Anonymous Devotee Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు ఓ భక్తుడు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకుండా రూ.కోటిని టీటీడీకి అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాన్ని ఇచ్చారు. అలాగే ఒడిశాకు చెందిన మరో భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.
అజ్ఞాత భక్తుడు రూ.కోటి విరాళం
హైదరాబాద్ అని చెప్పిన భక్తుడు
Tirumala Unknown Devotee
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం
తిరుమల శ్రీవారిని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుని విరాళాలు, కానుకలు ఇస్తుంటారు. తిరుమల శ్రీవారికి డబ్బులతో పాటుగా బంగారం, వెండి, విలువైన వస్తువుల్ని అందజేస్తుంటారు. కొందరు భక్తులు వాహనాలను కూడా స్వామివారిపై భక్తితో టీటీడీకి ఇస్తుంటారు. తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ కొన్ని ట్రస్ట్ల్ని ప్రారంభించగా.. వాటికి కూడా భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. చాలామంది భక్తులు విరాళాలకు సబంధించిన చెక్కుల్ని నేరుగా టీటీడీ అధికారుల చేతికి అందజేస్తుంటారు. కొందరు మాత్రం ప్రతినిధుల ద్వారా ఇస్తుంటారు.. కానీ ఓ భక్తుడు మాత్రం కనీసం తన పేరు కూడా చెప్పకుండా తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1 కోటి విరాళం అందజేసినట్లు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. అయితే ఆయన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని మాత్రమే తెలిపారు.. తన పేరు, ఇతర వివరాలు మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో రవిచంద్ర అభినందించారు. తిరుమల శ్రీవారి భక్తుల అన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.
మరోవైపు భువనేశ్వర్‌కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 07 నుండి 09వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 08న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు. ఈ మహోత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించనుంది. ప్రతి రోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవాలు నిర్వహిస్తారు. తొలి రెండు రోజుల పాటు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవాలలో పాల్గొనడం విశేషం.
చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారితో పాటు శ్రీరామచంద్ర మూర్తి, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి, అలాగే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. వసంత ఋతువులో లభించే పుష్పాలు, ఫలాలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా భక్తులు దివ్యానుగ్రహాన్ని పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా మే 07 నుండి 09వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవను, అలాగే మే 07న తిరుప్పావడ సేవను టీటీడీ రద్దు చేసింది.