తమిళనాడులో ‘విజయ్’ కేతనం.. స్టాలిన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..? దెబ్బ అదుర్స్ కదూ స్టాలిన్..!
తమిళనాడులో ‘విజయ్’ కేతనం.. స్టాలిన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..? దెబ్బ అదుర్స్ కదూ స్టాలిన్..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. విజయ్ విజయం వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో స్టాలిన్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ను దెబ్బతీశారని.. దానికి ప్రతిగా కేసీఆర్ విజయ్‌కు సహకరించి స్టాలిన్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
హైలైట్:
తమిళనాడులో విజయ్ ప్రభంజనం
స్టాలిన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్?
సోషల్ మీడియాలో గులాబీ సైనికుల సందడి
TVK Vijay
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ అనూహ్య రీతిలో దూసుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం TVK అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతుండటంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అయితే.. ఈ విజయంపై తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్ సాధిస్తున్న ఈ విజయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కారణమని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తిస్తున్నాయి.
ఈ చర్చకు ప్రధాన కారణం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. అప్పట్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఇండియా కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తెలంగాణలో కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. అప్పటి వరకు కేసీఆర్‌కు మద్దతుగా స్టాలిన్ ఉండగా.. నవంబర్ 21, 2023న డీఎంకీ పార్టీ ఆఫీస్ ‘అన్నా అరివాలయం’ నుంచి వెలువడిన ప్రకటనతో తెలంగాణలోని డీఎంకే క్యాడర్ మద్దతుదారులు, అభిమానులు, ఆ పార్టీ వింగ్స్ అంతా కలిసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి స్టాలిన్ పరోక్షంగా సహకరించారనేది గులాబీ శ్రేణుల బలమైన వాదన.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి స్టాలిన్ సహకరించారని భావించిన కేసీఆర్.. దానికి ప్రతిగా తమిళనాడులో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విజయ్‌కు దగ్గరయ్యారని ప్రచారం జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని, వ్యూహాలను ఆయనతో పంచుకున్నారని.. ఇప్పుడు వస్తున్న ఫలితాలు ఆ స్నేహానికి నిదర్శనమని సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ‘దెబ్బ అదుర్స్ కదా స్టాలిన్.. లెవెల్ అయిపోయింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నాడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం స్టాలిన్ కృషి చేస్తే.. నేడు తమిళనాడులో డీఎంకేను దెబ్బతీయడానికి కేసీఆర్ మద్దతు ఉన్న విజయ్ పార్టీ దూసుకుపోవడం ‘రిటర్న్ గిఫ్ట్’ అని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి విజయ్ పార్టీ విజయం తమిళనాడులోనే కాకుండా.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ వేడిని పుట్టిస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఏఐడీఎంకే 67, అధికార డీఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.