Ancient Temples : ఆ ఆలయంలో “ఆ రూపంలో” శివలింగం.. 60 ఏళ్లకోసారి అద్భుతం..

 Ancient Temples : ఆ ఆలయంలో “ఆ రూపంలో” శివలింగం.. 60 ఏళ్లకోసారి అద్భుతం..

Ancient Temples : ఆ ఆలయంలో “ఆ రూపంలో” శివలింగం.. 60 ఏళ్లకోసారి అద్భుతం..

ఆంధ్రప్రదేశ్.. అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. అలాంటి ఆలయమే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం అనేక ప్రత్యేకతల నిలయం. దేవాలయ నిర్మాణం నుంచి గర్భగుడిలోని స్వామివారి వరకూ.. ఈ ఆలయ ప్రత్యేకతలు ఎన్నో. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో ఉందీ ఈ పురాతన శివాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన ఆలయాల విశిష్టతలు, ప్రత్యేకతలు తెలుసుకోవటంలో భాగంగా.. ఈ రోజు ఈ ఆలయం చరిత్రను ఓసారి పరిశీలిద్దాం.

హైలైట్:
ఏపీలో వేలాది ఏళ్లనాటి పురాతన శివాలయం
పురుషాంగం ఆకారంలో విగ్రహం
గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం విశిష్టతలివే

Gudimallam
గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం
ఈ సకల చరాచర జగత్తులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో.. అంతుబట్టని విషయాలెన్నో.. తెలియని వాటిని తెలుసుకునేందుకు మనిషి సాగించే ఈ అన్వేషణ.. విశ్వంలాగే అనంతమైనది. మనిషి ఆలోచనలకు అంతం లేనట్లే.. విశ్వంలోని రహస్యాలకు అంతమనేది ఉండదు. ఈ సృష్టిలో కనిపించే ప్రతీ వస్తువుకో ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం.. మరో విషయంపై జిజ్ఞాసను పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్.. సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు ఆలవాలం. పురాతన దేవాలయాలకు పుట్టినిల్లు. వేలాది సంవత్సరాల కిందటి చరిత్రకు సజీవ సాక్ష్యం.. అలాంటి ఆలయాలలో ఒకటి గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపంలో ఉంది గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం . ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఈ పురాతన శివాలయం కొలువై ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం దగ్గర నుంచి ఆలయ నిర్మాణం వరకూ.. ప్రతీ అంశం ఓ ప్రత్యేకతే. గుడిమల్లం ఆలయంలోని విగ్రహం పురుషాంగం ఆకారంలో ఉంటుంది. ఏడు అడుగుల పొడవు ఉండే విగ్రహంపై తలపాగా, ధోవతితో ఉన్న రూపం ఉంటుంది. ఈ రూపాన్ని రుద్రుడి రూపంగా భావిస్తారు. రుద్రుడి రూపం యక్షుడి భుజాలపై కొలువై ఉంటుంది. మొత్తం విగ్రహం ఆకృతి పురుషాంగం ఆకారంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. అలాగే శివుడు లింగాకారంలో కాకుండా ఇలా మానవరూపంలో ఉండటం చాలా అరుదుగా చెప్తుంటారు.

గుడిమల్లం ఆలయం.. విగ్రహం అలా ఉండటానికి కారణమేంటి?
గుడిమల్లం ఆలయంలోని విగ్రహం పురుషాంగం ఆకారంలో ఉండటం వెనుక పలు కారణాలు ఉన్నాయట. పూర్వపు రోజులలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని.. స్త్రీని కొలిచే ఆచారం ఉండేదట. అప్పట్లో యోని ఆకారాన్ని పూజించే ఆచారం ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మాతృస్వామ్య వ్యవస్థ అంతరించి పురుషాధిక్యం పెరిగిన తర్వాత దానికి సూచికగా లింగం ఆకారాన్ని పూజించే ప్రక్రియ మొదలైనట్లు చెప్తారు. గుడిమల్లం ఆలయం క్రీ. పూ 2 వ శతాబ్దం లేదా 3వ శతాబ్దపు నాటిదిగా.. ఇక్కడి లింగం వేలాది ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్నటుగా పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు.

గుడిమల్లం ఆలయంలో 60 ఏళ్లకు ఓసారి అద్భుతం..
గుడిమల్లం ఆలయం స్వర్ణముఖీ నది సమీపంలో ఉంటుంది. ప్రతి 60 ఏళ్లకు ఓసారి స్వర్ణముఖి నదిలోని నీరు భూగర్భ నాళాల ద్వారా గర్భగుడిలోని ఆలయాన్ని తాకుతుందని.. ఆ తర్వాత అదృశ్యమవుతుందని స్థానికుల నమ్మకం. 2004లోనూ నదీజలాలు ఆలయంలోని విగ్రహాన్ని తాకినట్లు చెప్తున్నారు. అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సమయంలో.. అంటే సంక్రాంతి పండుగ అప్పుడు ఈ గుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతాయని స్థానికులు చెప్తున్నారు. ఇక ఒకప్పుడు ఈ ఆలయం పల్లపు ప్రాంతంలో ఉన్న కారణంగా గుడిపల్లం అనే పిలిచేవారని.. కాలక్రమంలో ఇది కాస్తా గుడిమల్లంగా మారిందని పలు చారిత్రక పుస్తకాల్లో పేర్కొన్నారు.

మొదటి శివలింగం.. త్రిమూర్తుల కలయిక
గుడిమల్లం ఆలయంలోని శివలింగాన్ని దేశంలోనే మొదటి శివలింగంగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడి శివలింగాన్ని త్రిమూర్తుల కలయికగా భావిస్తారు. చిత్రసేనుడు అనే యక్షుడి రూపంలో బ్రహ్మ, పరశురాముడి రూపంలో విష్ణువు, వీటిపైన శివలింగం రూపంలో మహేశ్వరుడు కొలువైనట్లు ఉన్న విగ్రహం రూపం ఆధారంగా ఓ కథ ప్రచారంలో ఉంది. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించిన పరశురాముడు.. తండ్రి ఇచ్చిన వరంతో తిరిగి తన తల్లిని బతికించుకుంటాడు. అయితే తల్లిని హత్య చేసిన అవమాన భారంతో కుమిలిపోతుంటాడు. ఇందుకు ప్రాయశ్చిత్తం కోసం రుషులను సంప్రదిస్తాడు. అప్పుడు రుషులు ఇచ్చిన సలహా మేరకు శివుణ్ని పూజించటానికి అడవికి చేరుకుంటాడు.

ఆ క్రమంలోనే పరశురాముడు ఈ ప్రాంతానికి చేరుకున్నాడని.. ఒక సరోవరం ఒడ్డున తపస్సు చేశాడని స్థలపురాణం. సరోవరంలో ప్రతి రోజూ ఓపూవు పూచేదని.. దీంతో శివుణ్ని ఆరాధించేవాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఓ రోజు ఈ పువ్వును బ్రహ్మదేవుడి ఉపాసకుడైన చిత్రసేనుడనే యక్షుడు ముందుగానే సంగ్రహించి, శివుణ్ని పూజించారు. దీంతో పరశురాముడు ఆగ్రహించగా.. వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగటంతో శివుడు ప్రత్యక్షమై.. ఇద్దరినీ తనలో ఐక్యం చేసుకున్నాడని.. అందుకే శివలింగంపై ముగ్గురు కనిపిస్తారని ప్రతీతి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *