నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు..

 నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు..

నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు..

కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చైతన్య సుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సెలూన్ షాపులో ఓ బార్బర్‌ను దుర్భాషలాడి, చేయి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నా అని పిలిచినందుకు సెలూన్ షాపులోని వర్కర్ మీద ఎస్ఐ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరగా.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు, నిజమేనని తేలటంతో ఎస్ఐ చైతన్య సుందర్‌ను సస్పెండ్ చేశారు.

హైలైట్:
కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
అన్నా అని పిలిచినందుకు సెలూన్ షాపులో బార్బర్ మీద చేయి చేసుకున్న ఎస్ఐ
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

Karimnagar
కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ
కరీంనగర్‌లో ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అన్నా అని పిలిచినందుకు ఓ బార్బర్ మీద చేయి చేసుకున్నారు. బార్బర్‌ను బూతులు తిడుతూ చేయి చేసుకున్న దృశ్యాలు సెలూన్ షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సదరు ఎస్ఐ మీద నెటిజన్లు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ.. సామాన్యుడిపై ఇలా చేయిచేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో.. ఆ ఎస్ఐ మీద సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలో ఉన్న ఓ సెలూన్ షాపుకు త్రీటౌన్ ఎస్ఐ చైతన్య సుందర్.. షేవింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. సెలూన్ షాపుకు వచ్చిన ఎస్ఐను బార్బర్ రాము గౌరవంగా పలకరించారు. కూర్చో అన్నా అంటూ సీటు చూపించారు. అయితే అన్నా అని సంబోధించటమే రాము పాపమైంది. అన్నా అని పిలవటంతో ఎస్ఐ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా అంటూ బూతులు తిడుతూ రాముపై చేయి చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సెలూన్ షాపులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఎస్ఐ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే పోలీసులు.. సామాన్యుడు అన్నా అని పిలిస్తే సహించలేరా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుడిపై చేయి చేసుకుంటారా అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. ప్రజలపై ఇలా దురుసుగా ప్రవర్తిస్తే.. జనంలో పోలీసులపై నమ్మకం, గౌరవం పోతాయని మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైరల్ వీడియో వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

ఈ నేపథ్యంలో కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చైతన్య సుందర్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. విచారణలో సెలూన్ షాపులో బార్బర్ మీద చేయి చేసుకోవటం నిజమని తేలటంతో ఎస్ఐ చైతన్య సుందర్‌పై చర్యలు తీసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఎస్ఐ చైతన్య సుందర్‌న సస్పెండ్ చేశారు. ఈమేరకు సీపీ గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *