తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు.. రెండ్రోజులు మరింత తీవ్రత, ఐఎండీ హెచ్చరిక
రికార్డు స్థాయి ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల ఎండ నమోదైంది. నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అంటున్నారు.
హైలైట్:
తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు
రెండ్రోజులు మరింత తీవ్రత
ఐఎండీ హెచ్చరికలు జారీ
temperatures in Telangana
తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటిందంటే చాలు కాలు బయటపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉదయం 10 తర్వాత రోడ్లు పూర్తి నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం (మార్చి 6) పలు జిల్లాల్లో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అయితే 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. భద్రాచలంలో సాధారణంగా 36.3 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా.. 3.7 డిగ్రీలు పెరిగింది. ఇక మహబూబ్‌నగర్‌లో 36.6 డిగ్రీలకు 3.4 డిగ్రీలు పెరిగింది. ఆదిలాబాద్‌లో 35.5 డిగ్రీల సెల్సియస్‌కు 3.3, ఖమ్మంలో 34.6 డిగ్రీల సెల్సియస్‌కు 4 డిగ్రీలు అధికంగా నమోదైంది.
రాష్ట్రంలో నేడు రేపు, (శని, ఆదివారాల్లో) కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండుమూడు డిగ్రీలు అధికంగా ఎండలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన 27 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా చూసుకోవాలంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. వదులైన కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. గొడుగు, టోపీని ఉపయోగించాలని.. అలాగే కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలని అంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.