• April 22, 2026

తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..

గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కావాల్సిన చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి నుంచి 50:50 నిష్పత్తిలో రూ.43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలని నిర్ణయించింది. టీటీడీకి సరఫరా చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించినట్లు సమాచారం.

Tirumala

తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం

తిరుమలలో గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి చీరలు, ఇతర ముఖ్యమైన వస్త్ర సామాగ్రిని సేకరించాలని టీటీడీ నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి రూ. 43 కోట్ల విలువైన చీరలు, ఇతర ముఖ్యమైన వస్త్ర సామాగ్రిని సేకరించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా 60 కి పైగా దేవాలయాల వ్యవహారాలను టీటీడీ నిర్వహిస్తోంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రమే దాదాపు 65 స్వచ్ఛమైన జరీ మెల్‌చాట్, ఉత్తరీయం వస్త్రం సెట్‌లు, 1,080 స్వచ్ఛమైన జరీ పట్టు చీరలు (చేనేత) అవసరమవుతాయి. అలాగే టీటీడీ కింద ఉన్న స్థానిక ఆలయాలకు ఏటా 320 మేల్ చాట్, ఉత్తరీయం వస్త్రం సెట్‌లు, తొమ్మిది గజాల పట్టు చీరలు 128, ఆరు గజాల పట్టు చీరలు (చేనేత) 300 వరకూ అవసరమవుతాయి.

వీటికి అదనంగా టీటీడీకి 36 వేల పట్టు శాలువాలు( పవర్ లూమ్స్), 60 వేల పాలిస్టర్ శాలువాలు, 10.8 లక్షల కాటన్ వస్త్రాలు, 9 లక్షల కాటన్ బ్లౌజ్ పీసులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి వీటిని కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్ లూమ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (ఆప్కో) తమిళనాడు హ్యాండ్ లూమ్ వీవర్స్ సొసైటీ (కోఆప్టెక్స్) ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం టీటీడీ కోరిన విధంగా వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ సంస్థలు అంగీకరించినట్లు తెలిసింది. మరోవైపు ఇద్దరు సరఫరా దారులలో ఎవరైనా ఒకరు సమయానికి వీటిని సరఫరా చేయకపోయినా.. అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో 50:50 నిష్పత్తిలో సరఫరా కోసం టీటీడీ మల్టీ వెండార్ విధానం ఎంచుకుంది.

మరోవైపు మల్బరీ పట్టు శాలువాలకు ఆర్డర్ పెడితే.. ఓ సంస్థ పట్టు శాలువాలకు బదులుగా వందశాతం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసిందంటూ గతేడాది టీటీడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 2015 నుంచి 2025 వరకూ వీటిని సరఫరా చేసిందని పేర్కొంది. 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకూ చేసే శాలువాలను.. రూ.1,389కు అప్పట్లో కొనుగోలు చేశారని టీటీడీ ఆరోపించింది. పట్టు శాలువాల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖను తిరుమల తిరుపతి దేవస్థానం కోరటంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీటీడీకి కావాల్సిన చీరలు, వస్త్రాలు ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *