తెలంగాణకు మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. మే రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ప్రమాదాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట పట్టకపోవడం, గందరగోళం వంటి లక్షణాలను గుర్తిస్తే తక్షణమే స్పందించాలని, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.
హైలైట్:
తెలంగాణకు మరో అల్పపీడనం
ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
Telangana Rains
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో మే రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈనెల 11 లేదా 12 తేదీల్లో అల్పపీడనం బలపడనుందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ లోపు మే 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం క్యుములోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ నిజామాబాద్ జిల్లా మెండోరాలో 45.4 డిగ్రీల సెల్సియస్, జగిత్యాలలో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయిని చెప్పారు.
పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హీట్ స్ట్రోక్ అనేది కేవలం నీరసం మాత్రమే కాదని.. అది ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి అని హెచ్చరిస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చినప్పుడు శరీరం చెమట ద్వారా వేడిని తగ్గిస్తుందని.. కానీ హీట్ స్ట్రోక్‌లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుందని చెబుతున్నారు. ఎండలో ఉన్నా చెమట పట్టకపోవడం అనేది అత్యంత ప్రమాదకర సంకేతమని దీనివల్ల మెదడు, గుండె, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.
హీట్ స్ట్రోక్ బారిన పడినప్పుడు తొలి ఐదు నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితుడికి స్పృహ తప్పడం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే అంబులెన్స్ కోసం వేచి చూడకుండా వెంటనే నీడకు తరలించాలని సూచిస్తున్నారు. తడి వస్త్రంతో శరీరాన్ని తుడవడం, మెడ, చంకల భాగంలో ఐస్ ప్యాక్‌లు పెట్టడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ప్రథమ చికిత్సలో ప్రధాన భాగమని వివరించారు. అధిక వేడి వల్ల గుండెపై భారం పెరుగుతుందని ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజలు ఎండల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగాలని మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని ఒకవేళ వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. మద్యం, కెఫీన్ కలిగిన పానీయాలు శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయని వాటికి దూరంగా ఉండాలని అంటున్నారు. పార్క్ చేసిన కార్లలో పిల్లలను ఉంచడం వంటి పొరపాట్లు అస్సలు చేయవద్దని సూచిస్తున్నారు.