తమిళనాడులో విజయ్ బంఫర్ విక్టరీ.. TRS అధినేత్రి కవితకు బిగ్ బూస్ట్, ఇక తగ్గేదేలే..!
తమిళనాడులో విజయ్ బంఫర్ విక్టరీ.. TRS అధినేత్రి కవితకు బిగ్ బూస్ట్, ఇక తగ్గేదేలే..!
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ కేవలం రెండేళ్లలోనే అధికారం చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ విజయం తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు పెద్ద ఊరటనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో కవిత పార్టీ పెట్టగా.. కొత్త పార్టీల మనుగడ కష్టమన్న విమర్శలకు విజయ్ విజయం ఒక సమాధానంగా నిలిచిందని అంటున్నారు. 2028 ఎన్నికల నాటికి విజయ్ బాటలో కవిత కూడా తెలంగాణలో చక్రం తిప్పుతారని ఆమె అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
హైలైట్:
తమిళనాడులో దళపతి విజయ్ సునామీ
కల్వకుంట్ల కవితకు బిగ్ బూస్ట్
విజయ్ గెలుపుతో కవితలో పెరిగిన ధీమా
Kalvakuntla Kavitha
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సృష్టించిన ప్రభంజనం ద్రావిడ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చివేసింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేలు అధికారాన్ని పంచుకుంటుండగా.. ఆ పార్టీలకు విజయ్ గట్టి షాక్ ఇచ్చారు. తాజా ట్రెండ్స్ ప్రకారం TVK ఒంటరిగా వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉంది. 2024 ఫిబ్రవరిలో పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతుండటం ప్రస్తుత రాజకీయాల్లోనే ఒక అద్భుతం.
అయితే.. ఈ ‘విజయ్ విక్టరీ’ ప్రభావం ఇప్పుడు తెలంగాణపై ముఖ్యంగా కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS)పై స్పష్టంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటించారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను వదిలేసిందని.. జాతీయ రాజకీయాల మోజులో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత పేరును (TRS) తిరిగి తెరపైకి తెస్తూ.. తెలంగాణ అస్థిత్వమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘పాంచజన్యం’ పేరుతో ఒక ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే ప్రణాళికను ప్రకటించారు. ‘అమ్మ’గా రాష్ట్రంలో పాలన అందిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే కవిత కొత్త పార్టీపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటి పార్టీలు ఎన్నో వస్తాయి, పోతాయి.. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీలకు మనుగడ కష్టం’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. దీనికి సమాధానంగా కవిత.. నాటి ఎన్టీఆర్ 9 నెలల్లోనే అధికారం సాధించిన ఉదాహరణను ప్రస్తావించగా.. విమర్శకులు ‘అప్పటి కాలం వేరు.. ఇప్పటి కాలం వేరు’ అని కౌంటర్ ఇస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తమిళనాడులో విజయ్ సాధించిన విజయం కవితకు ఒక గొప్ప ‘పొలిటికల్ బూస్ట్’గా మారింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉన్న సెలబ్రిటీలు రాజకీయాల్లో నెగ్గరన్న వాదనను విజయ్ పటాపంచలు చేశారు. కేవలం రెండేళ్లలో తమిళనాడు వంటి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురావటం కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
విజయ్ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకొని కవిత తన కార్యాచరణను మరింత వేగవంతం చేస్తుందని ఆ పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈలోపు గ్రామ గ్రామాన ‘పాంచజన్యం’ ప్రణాళికను తీసుకెళ్లి ప్రజల నాడి పట్టుకుంటారని అంటున్నారు. తమిళనాడులో విజయ్ ఎలాగైతే రెండేళ్లలోనే అద్భుతం చేశారో.. తెలంగాణలో కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ అదే రీతిలో అధికారం చేపడుతుందని తెలంగాణ రక్షణ సమితి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళనాడు రాజకీయాలు వేరని.. అక్కడి పరిస్థితులు వేరని.. విజయ్‌కు ఉన్న ఇమేజ్ వేరని.. అలాంటి సినారియో తెలంగాణలో వర్కౌట్ అవుతుందా..? అంటే అవ్వకపోవచ్చునని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.