కొడుకుని పోలీస్ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్
కొడుకుని పోలీస్ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు కుంట్లూరుకు చెందిన ఆమె.. చదువుకోకపోయినా తన పిల్లల కోసం 1959లోనే నగరం వచ్చి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించారు. ఆమె ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆనంద్.. తాజాగా డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఉద్విగ్న క్షణాలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పంచుకున్నారు.
హైలైట్:
కొడుకుని పోలీస్ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి
ఓ తల్లికి ఇంతకంటే ఏం కావాలి
డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్
CV Anand DGP
తల్లి కన్న కలలు, చేసిన త్యాగాలు వృథా పోవు అని చెప్పడానికి తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రయాణమే ఒక నిదర్శనం. ఒక సామాన్యమైన కుటుంబ నేపథ్యం ఉన్న తల్లి.. తన కుమారుడిని అత్యున్నత స్థాయికి చేరుకోవటం చూసి మురిసిపోయింది. 92 ఏళ్ల యశోదాదేవి తన కుమారుడు చామరాజ వెంకట ఆనంద్ ( సీవీ ఆనంద్ ) తెలంగాణ పోలీస్ బాస్ (DGP)గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలుసుకొని ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఈ మేరకు తల్లి ఆశీర్వాదం తీసుకున్న డీజీపీ సీవీ ఆనంద్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు. తన తల్లి కల నిజమైందని చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరుకు చెందిన యశోదాదేవి పాఠశాలకు వెళ్లలేకపోయినా.. చదువు విలువను ఆనాడే గుర్తించారు. ముఖ్యంగా రానున్న కాలంలో ఆంగ్ల విద్య ప్రాధాన్యతను ఊహించిన ఆమె.. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 1959లోనే హైదరాబాద్‌కు మకాం మార్చారు. తన కుమారుడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి ప్రతి అడుగులోనూ ప్రోత్సాహాన్ని అందించారు. తల్లి అందించిన ఆ స్ఫూర్తితోనే సీవీ ఆనంద్ చదువులోనే కాకుండా క్రికెట్లోనూ రాణించారు. 1990లో తన మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించి సత్తా చాటారు.
సీవీ ఆనంద్ 2021లోనే డీజీపీ హోదా పొందినప్పటికీ.. తెలంగాణ పోలీస్ శాఖకు హెచ్వోపీఎఫ్గా నియమితులయ్యేందుకు ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఈ నెల 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఉద్విగ్న క్షణాలను సీవీ ఆనంద్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ.. తన ఎదుగుదలలో తల్లి పాత్రను గుర్తుచేసుకున్నారు.
‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. నా తల్లి నవంబర్- జనవరి మధ్య చాలా అనారోగానికి గురయ్యారు. . ఇప్పుడు కూడా మంచానికే పరిమితమయ్యారు. అయినా త్వరగా కోలుకుంటున్నారు. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. నన్ను డీజీపీగా చూసి ఆమె ఎంతో సంతోషించారు, నేను కూడా అంతే.’ అని సీవీ ఆనంద్ ట్విట్టర్ ఎక్స్‌లో అందుకు సంబంధించిన ఫోటోలతో పోస్టు చేశారు. కాగా, ఒక నిరక్షరాస్యత కలిగిన తన తల్లి కల.. నేడు ఒక రాష్ట్ర పోలీస్ వ్యవస్థకే మార్గదర్శిగా నిలవడమనేది భావి తరాలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయక పాఠమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.