హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు
హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు
ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్‌గా పనిచేసే వ్యక్తి.. తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. మిగిలిన యవ్వారాలు మొదలుపెట్టాడు. మొదట స్కూళ్లో విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తి.. ఒక పక్క డబ్బులు దోచుకుంటూనే.. మరో పక్క పూజల పేరుతో మహిళలను అసభ్యంగా తాకేవాడు. చివరికి ఆ కామపిశాచి వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో.. అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
హెడ్మాస్టర్ ఘోరాలు.. పూజలని చెప్పి విద్యార్థులతో అశ్లీల చిత్రాలు
అతడో హెడ్ మాస్టర్. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో ఉండి ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. చిన్న పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించాడు. దీంతో పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. స్వామీజీ వేషం వేసి.. పూజలు చేస్తానంటూ నమ్మిస్తూ.. లక్షల్లో వసూలు చేస్తున్నాడు. పైగా మహిళలను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు దిగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఆ హెడ్ మాస్టర్ కమ్ స్వామీజీ కమ్ కామాంధుడి కథ ముగిసినట్లయింది. మహబూబాబాద్ జిల్లా రాజోలు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ జాడ్పోడ్ ప్రతాప్ చీకటి వ్యవహారం ఇదే.
గురువు అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించేవాడు. కానీ ఈ హెడ్ మాస్టర్ గారు మాత్రం పైశాచికత్వానికి పరాకాష్ఠగా మారాడు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, మూఢనమ్మకాల చీకట్లోకి నెట్టేస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దానికి భక్తి, శక్తి అనే పేర్లు పెడుతున్నాడు. పూజల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ గుండ్రాతి మడుగుకు చెందిన ఈ ప్రతాప్.. తునగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఈ హెడ్ మాస్టర్ బుట్టలో పడేశాడు.
తాను పూజలు చేస్తానని.. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని చెప్పి నమ్మించి ఏకంగా రూ. 10 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ డబ్బును విరాళంగా ప్రకటిస్తే.. మరిన్ని విరాళాలు వస్తాయని కూడా మాయమాటలు చెప్పి ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. తీరా చూస్తే.. ఆ డబ్బుతో ఖమ్మంలో ఒక ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. కురవి పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పడంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఇక ఆ తర్వాత ఈ ప్రతాప్ ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. గతంలో కట్టెలమండి స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నప్పుడు చిన్న పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించాడనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇలాంటి వ్యక్తిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ప్రతాప్ తన రూట్ మార్చాడు. ఈసారి ఏకంగా బాబా అవతారం ఎత్తాడు. పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తూనే మహిళల పట్ల నీచంగా ప్రవర్తించేవాడు. పూజల పేరిట మహిళల ఒంటిపై చేయి వేసి.. వికృత చేష్టలకు ఎలా పాల్పడేవాడు. భక్తి పేరుతో వారి భయాన్ని ఆసరాగా చేసుకుని.. అసభ్యంగా ప్రవర్తిస్తుండం కళ్లప్పగిచ్చి ఆ మహిళలతో వచ్చిన పురుషులు కూడా చూస్తూ దండం పెడుతూ స్వామీజీ సూపర్ అనుకుంటూ విగ్రహాల్లా నిలబడిపోవటం గమనార్హం.
పక్కనే పసిపిల్లలు విలవిల్లాడుతూ ఏడుస్తున్నారు.. భయంతో వణికిపోతున్నారు.., కనీసం వాళ్ల మీద జాలి లేకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. చిన్నపిల్లలపై బూడిద చల్లుతూ, వారిని వింత వింత చేష్టలతో వేధించడం కూడా ఒక శక్తేనా.. ఇదెక్కడి అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.