భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం లో శ్రీ సీతారాముల కళ్యాణం.. ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఇక అశేష భక్తజనం జయ జయ ధ్వానాల మధ్య మిథిలా మండపంలో అభిజిత్ లగ్నంలో ఆలయ పూజారులు, వేద పండితులు సీతారాముల కళ్యాణ క్రతువును పూర్తి చేశారు.
ఇక భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని కళ్లారా చూసేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పుర వీధులన్నీ మార్మోగిపోయాయి. ఈ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు.
ఇక ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు.
రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు వచ్చిన భారీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాచలం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు.. లడ్డు ప్రసాదాలను పంపిణీ చేయడం కోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసింది. భద్రాద్రి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలను సుమారు 100 ఏళ్లుగా ఒకే కుటుంబం అందిస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఎస్ ఎస్ జయరాజు ఫ్యామిలీ.. ఈ పట్టు వస్త్రాలను సిద్దం చేస్తోంది. ఆ కుటుంబంలోని 3 తరాలు.. ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. భద్రాచలం ఆలయం ఆవరణలోనే ప్రత్యేకంగా ఒక మగ్గాన్ని ఏర్పాటు చేసి.. పోచంపల్లి స్టైల్లో సీతమ్మకు చీరలు.. రామలక్ష్మణులకు పంచెలను నేశారు. రూ.2 లక్షల వ్యయంతో తయారు చేసిన ఈ పట్టు వస్త్రాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి సమర్పించారు.