తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ
తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి అపార నష్టం వాటిల్లింది. నేడు కూడా వర్షం హెచ్చరికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైలైట్:
తెలంగాణకు రెయిన్ అలర్ట్
నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
Telangana Weather Alert
తెలంగాణ వెదర్ అప్డేట్
తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రానికి వాతావరణం ఉన్నట్లుండి మారిపోయి అకాల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (మార్చి 24) హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుశాయి. నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తర, తూర్పు జిల్లాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుదని అన్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చునని తెలిపారు. అయితే ద్రోణి ప్రభావం, అనుహ్య వాతావరణ మార్పుల కారణంగా కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో నేడు సాయంత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
మంగళవారం వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్ షేక్‌పేటలో 51.3 మి.మీ, ఖాజాగూడ 36.8, మియాపూర్ 33.3, గచ్చిబౌలి 31.5, మూసాపేట్ 26.8, మాదాపూర్ 26.8, బాలానగర్ 25.3, లంగర్ హౌస్ 23.8, కేపీహెచ్‌బీ కాలనీ 23.8, అత్తాపూర్ 23, శివరాంపల్లి 18, ఆసిఫ్‌నగర్ 17, బహదూర్‌పురా 16.5, జూబ్లీ హిల్స్ 14.3, ఫిరోజ్‌గూడ 13.3 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కొండాపూర్ ప్రాంతంలోని కాసేపు వడగళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో వడగండ్ల వానతో వరి ధాన్యం నేలరాలింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడ, దుబ్బగూడ, ఇన్కర్గూడ, ధనోరా(బీ), హీరాపూర్, కేస్లాపూర్, ఏమాయికుంట, ముత్నూర్, దేవాపూర్‌లో భారీ ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించి నిత్యావసర సరుకులు పూర్తిగా నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో మామిడి, వరి, జొన్న, మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయి. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.