తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్ కసరత్తులు

 తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్ కసరత్తులు

పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు.

Mahalakshmi Scheme

తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్ కసరత్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా.. ఎన్నికల హామీల్లో మిగిలిన మరిన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నికల హామీలను అమలు చేయగా.. మరికొన్ని ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల అన్నీ అమలు చేయలేక పోతున్నామని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. 20న తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్‌లోనే పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయంపై ప్రకటన ఉండొచ్చనే వార్తలు ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారాయి.

మరోవైపు.. ఆసరా పెన్షన్లలో భాగంగా పింఛన్లను వృద్ధులకు రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఇప్పటివరకు మాత్రం ఈ హామీ అమలు కాలేదు. దీంతో పింఛన్ పెరుగుతుందని భావిస్తున్న వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. పింఛన్ల పెంపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక కూడా అందించింది. ప్రస్తుతం రూ.2 వేలు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లకు రూ.6 వేలకు పెంచితే.. ఇప్పుడు అయ్యే ఖర్చు కంటే రాష్ట్ర ఖజానాపై ఎంత అదనపు ఖర్చు అవుతుందనే దానిపై సమగ్ర రిపోర్టును అందించింది. ఆ నివేదికకు అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు.. మహాలక్ష్మి పథకం లో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు దాటి అర్హులైన మహిళలు అందరికీ ప్రతీ నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో వెల్లడించింది. దీనికి సంబంధించి కూడా ఈ బడ్జెట్‌లోనే ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకం అమలుకు నిధుల అందుబాటుపై ఆర్థిక శాఖ.. సీఎం రేవంత్ రెడ్డికి నివేదికలు కూడా అందించింది. దీనిపై బడ్జెట్‌లో ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇక బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీలో ఈ పథకాల అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పథకాలతోపాటు విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ టాప్‌లు అందించే పథకంపైనా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *