భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు

శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Bhadrachalam

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు

త్వరలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఇప్పటికే భద్రాద్రి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో భద్రాద్రి రామయ్య వద్ద జరిగిన సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి రామాలయంలో ఇప్పుడు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. స్వామి వారికి భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లు.. ఇప్పుడు స్వామికి పెట్టిన పట్టు వస్త్రాలు చోరీకి గురి కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఓ భక్తురాలు భద్రాచలం రామాలయంలో సీతాదేవికి సమర్పించిన ఓ విలువైన పట్టుచీర మాయం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండానే గర్భగుడిలో నుంచి ఆ పట్టు చీర అదృశ్యం కావడం భద్రాద్రి దేవస్థాన సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా ఎత్తి చూపుతోంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో దామోదర్ రావు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే గర్భగుడిలోని పట్టు వస్త్రాలు మాయం కావడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి సీతారామ లక్ష్మణులకు అలంకారం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన జ్యోతి అనే ఓ భక్తురాలు పట్టు పంచెలతో పాటు విలువైన పట్టు చీరను కూడా స్వామి వారికి ఇటీవల సమర్పించారు. ఆ దివ్య మూర్తులకు అలంకరణ చేసిన తర్వాత గర్భగుడిలో ఉన్న రామాలయం ఊయలలో పట్టుచీరను ఉంచారు. అయితే ఆ పట్టుచీర కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి మాయం కావడం ఇప్పుడు తెగ సంచలనంగా మారింది.

అప్పటివరకు అక్కడే ఉన్న పట్టు చీర, పట్టు పంచెలను అంత తొందరగా, చాకచాక్యంగా ఎవరు దొంగిలించారు అనేది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కడం లేదు. దేవస్థానంలో బాధ్యత మరిచిన ఉద్యోగులతో పాటు.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఈవో దామోదర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. పట్టు చీర మాయం అయిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని ఈవో హామీ ఇచ్చారు.

చాలా దూర ప్రాంతాల నుంచి భక్తితో స్వామివారిని దర్శించుకునేందుకు, పట్టు వస్త్రాలు సమర్పించుకునేందుకు చాలా మంది వస్తారని.. అయితే భక్తితో తాము దేవుడికి సమర్పించిన పట్టు వస్త్రాలు ఇలా మాయం కావడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు.. దేవస్థాన అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *