హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్
హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్
హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతోంది.
Petrol Pumps Closed
హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడుతోంది. ప్రపంచ దేశాలకు కీలక చమురు రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకలను వెళ్లకుండా ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో కూడా చమురు కొరత ఏర్పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఇటీవల పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో మిగిలిన పెట్రోల్ బంకుల వద్దకు జనం భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకుల ముందు వాహన దారులు కిలోమీటర్ల మేర పడిగాపులు కాస్తున్నారు. పాతబస్తీలోని సీఎన్జీ ఫిల్లింగ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లు భారీగా ఎదురుచూపులు చూస్తున్నారు. పాతబస్తీతోపాటు బహదూర్‌పురా, అంబర్పేట్, తాడ్‌బండ్, హస్సన్ నగర్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.
మరోవైపు.. హైదరాబాద్‌లోని మిగిలిన పలు పెట్రోల్ బంకుల వద్ద తెల్లవారుజాము నుంచే వాహనదారులు కిక్కిరిసిపోయారు. లక్డీకపూల్, గచ్చిబౌలి, దిల్షుఖ్ నగర్, అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు ఆటోలు రోడ్లపైనే నిలిపేశారు. డబ్బులు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ బంకులకు సరఫరా చేస్తామంటూ ఆయిల్ కంపెనీలు.. ఇటీవలి కాలంలో కొత్తగా మెలిక పెడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే డబ్బులు లేక చాలా మంది పెట్రోల్ బంక్ డీలర్లు చమురు కొనడం ఆపేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని.. కానీ ఇప్పుడు చమురు కొరత నేపథ్యంలో క్రెడిట్ ఇవ్వకపోవడంతోనే బంకులు మూసివేసే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నాయి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. చమురు కొరత ఆరోపణలను కొట్టివేస్తోంది. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరూ భయపడాల్సిన పని లేదని.. ఆందోళనకు గురై.. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ.. మరింత కావాలని పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టొద్దని సూచిస్తోంది. వాహనదారులు అనవసరంగా కంగారు పడొద్దని తేల్చి చెప్పింది. దేశంలో ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు కూడా వెల్లడించారు.