ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్, ఇలా చేయండి
ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్, ఇలా చేయండి
Andhra Pradesh High Temperatures And Heat Waves Today: ఏపీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఏకంగా 48 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం ఉంది. ఎండలు సంగతి ఇలా ఉంటే.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటు ప్రజలు బయటకు వెళ్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైలైట్:
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్
ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
జాగ్రత్తగా ఉండాలని సూచనలు
AP High Temperatures Heat Waves
ఏపీలో మండిపోతున్న ఎండలు
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత, వేడిగాలుల తీవ్రత మరింత పెరిగిందని.. రాష్ట్రంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇవాళ రాష్ట్రంలోని 68 మండలాల్లో తీవ్ర వేడిగాలులు.. అలాగే 93 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని సూచనలు చేశారు. ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు.
మరోవైపు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. వర్షంతో పాటుగా గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.. వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, హోర్డింగ్స్ దగ్గర, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడొద్దని సూచించారు. ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు ఎండలు, వేడిగాలులు ఉక్కపోతగా ఉంది. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అలాగే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు.. పంట్నలి జాగ్రత్త చేసుకోవాలని సూచించారు.
‘ఈ వేసవిలో ఒకరి ప్రాణాన్ని కాపాడే సూపర్ హీరో అవ్వండి అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ కొత్త పిలుపు ఇచ్చింది. ఎండలు మండిపోతున్నాయి, వేడిగాలులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కానీ,చిన్న చిన్న జాగ్రత్తలతో మనం మనల్ని, మన చుట్టుపక్కల వారిని కాపాడుకోవచ్చు దాహంతో ఉన్నవారికి ఇచ్చే వాటర్ బాటిల్ ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు. ప్రయాణాల్లో లేదా పనిలో ఉన్నప్పుడు కాసేపు నీడ ఉన్న చోట ఆగడం/ఉండటం వల్ల వేడి ఒత్తిడి (Heat Stress)ని నివారించవచ్చు. మీ ఇంటి పక్కన ఉండే వృద్ధులు, ఒంటరిగా ఉండే వారిని ఒకసారి పలకరించి, వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోండి. చిన్న పలకరింపు.. పెద్ద మార్పు తెస్తుంది. అవగాహన కల్పిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం. ఈరోజే వడగాలుల నుంచి భద్రతపై ప్రతిజ్ఞ (Heatwave Safety Pledge) చేయండి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ట్వీట్ చేసింది.