Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం..
Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం..

మీనాను తీసుకొస్తాను.. బాలు సవాల్..
చెప్పుతో కొట్టిందని తెలియగానే ప్రభావతిపై అరుస్తాడు బాలు. ‘నువ్వు చేసిన పనికి ఆ కుటుంబం ఏమైనా చూసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి.. “అవునురా, వాడు నీకు బావమరిది కదా.. అందుకే వెనకేసుకొస్తున్నావు. మీనా, ఆమె తమ్ముడు కలిసి ఈ ఇంటి పరువు తీశారు. ఇక ఆ మీనా ఈ ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు” అని బాలుకి తేల్చి చెబుతుంది. బాలు గట్టిగా “అమ్మా నిజం తెలియకుండా మాట్లాడకు. మీనాను గౌరవంగా ఈ ఇంటికి తిరిగి తీసుకొస్తా.. ఇది నా సవాల్” అంటూ ఇంటి నుంచి వెళ్తాడు. సత్యం మాత్రం ఏం మాట్లాడలేక మౌనంగానే ఉంటాడు.
వీడియో చూసి.. పోలీసుల గాలింపు..
మరోవైపు శివ దొంగతనం చేసిన వీడియో వైరల్ కావడంతో ..అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరుగుతుంది పోలీసులకు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి, శివ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడతారు. మరోవైపు బాలు నేరుగా మీనా పుట్టింటికి వెళ్ళాడు. అక్కడ శివ చేసిన పనికి మీనా, సుమతి, పార్వతమ్మ ముగ్గరూ ఏడుస్తూ ఉంటారు. బాలును చూడగానే మీనా తట్టుకోలేకపోయింది. మీనా ఏడుస్తూ బాలు గుండెల మీద పడి “నన్ను క్షమించండి.. నా తమ్ముడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. నిజం తెలియక మిమ్మల్ని కూడా వాడి చెయ్యి విరిచినప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాను” అని బాలు దగ్గన మీనా బాధపడుతుంది.
బాలు ఇప్పుడు మారిపోయాడు అత్తయ్యా..
బాలు ప్రేమగా మాట్లాడుతూ..”మీనా.. పిచ్చిదానిలా మాట్లాడకు, లే.. నేనున్నాను కదా, శివ చిన్నపిల్లాడు. వాడు మా అమ్మా మీద కోపంతోనే అలా చేశాడు. దీని వెనుక ఆ గుణ ఉన్నాడు. వాడు శివను తప్పుదోవ పట్టించాడు” అని చెబుతాడు. పార్వతి బాధపడుతూ.. దన్నం పెడుతూ.. “అవును బాబు.. వాడు చెడిపోయాడు., అది తెలియక మిమ్మల్ని చాలా మాటలు అన్నాను.. నన్ను క్షమించు” అని బాలు క్షమాపణలు చెబుతుంది. సుమతి కూడా సారీ బావా అంటుంది. వెంటనే బాలు.. “అత్తయ్య.. మీరు బాధపడకండి. శివ మనస్తత్వం నాకు తెలుసు. వాడిని ఎలాగోలా బయట పడేస్తాను.. వాడు ఇప్పుడు మారిపోయాడు..” అని భరోసా ఇస్తాడు. బాలు మాటలతో మీనా కుటుంబానికి కొంత ధైర్యం, నమ్మకం కలిగినట్లు అవుతుంది.
పోలీసులను రిక్వస్ట్ చేసిన బాలు..
అదే సమయంలో పోలీసులు మీనా ఇంటికి చేరుకున్నారు. వీడియో వైరల్ కావడంతో అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పారు. పోలీస్ మాట్లాడుతూ.. “శివ ఎక్కడ? వీడియోలో దొంగతనం స్పష్టంగా కనిపిస్తోంది. అతన్ని అప్పగించండి” అని మీనా కుటుంబాన్ని అడుగుతారు. దీనికి బాలు.. “సార్.. ఇది మా ఇంటి సమస్య. వీడియో ఉన్న ఆవిడ మాఅమ్మే. ఆవిడ దగ్గరే డబ్బులు దొంగలించాడు. మళ్లీ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు. దయచేసి వదిలేయండి” అని పోలీసులను వేడుకుంటాడు.మీనా, పార్వతమ్మ, సుమతి కూడా పోలీసులను చాలా రిక్వస్ట్ చేస్తుంటారు. అయితే వాళ్లు వినరు.
మీ అమ్మగారే రాసి ఇవ్వాలి.. అప్పుడు వదిలేస్తాం.. పోలీసులు క్లారిటీ..
బాలు అలా చెప్పగానే పోలీసులు మాట్లాడుతూ.. “వీడియో బయటకు రాకముందు అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఉంది. మేము యాక్షన్ తీసుకోవాల్సిందే..ఒకవేళ శివను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే.. మీ అమ్మగారే స్వయంగా స్టేషన్‌కి వచ్చి.. ఇది మాఇంటి సమస్య అని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వదిలేస్తాం” అని తేల్చి చెబుతారు. శివ ఎక్కడున్నాడని పోలీసులు పదేపదే అడగగా.. ‘వీడియో వైరల్ అయినప్పటి నుంచి వాడు ఇంట్లో లేడు… మేము కూడా వెతుకుతున్నాం… వచ్చాక నేనే తీసుకువస్తాను” అని పోలీసులకు బాలు హామీ ఇస్తాడు. దాంతో వాళ్లు వెళ్లిపోతారు.
దగ్గర రాకండి.. శివ ఆత్మహత్యాయత్నం
పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత, చాలాసేపటి నుంచి శివ కనిపించడం లేదని మీనా చెప్పడంతో బాలుకు అనుమానం వచ్చి ‘ఏదైనా చేసుకుంటున్నాడా?’ అంటూ బయటకు పరుగెడతాడు. వెనుకే మీనా వాళ్లు పరుగుతీస్తారు. నిజంగానే వీధి చివర ఉన్న మూడు అంతస్తుల భవనం వద్ద శివ బైక్ కనిపిస్తుంది. వెంటనే పైకి పరుగెత్తుతారు. బాలు ఊహించినట్టే శివ ఆ భవనం పైనుంచి దూకడానికి సిద్ధంగా ఉంటాడు. బాలుతో సహా మీనా కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకున్నారు. శివ ఏడుస్తూ “దగ్గరకు రాకండి, నేను బతకడం అనవసరం. దొంగగా అందరి ముందు తలవంచుకోలేను. నా వల్ల కుటుంబ పరువు పోయింది, నా జీవితానికి ఇక విలువ లేదు, నన్ను వదిలేయండి’ అంటూ శివ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
శివను కాపాడిన బాలు
బాలు నిమ్మళంగా దగ్గరకు వెళ్తూ “శివ.. నా మాట విను. నువ్వు దొంగవు కావని నాకు తెలుసు. నువ్వు ఆవేశంలోనే దొంగతనం చేశావు. దూకేస్తే సమస్య తీరదు. నేను నీకు హామీ ఇస్తున్నాను.. నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం లేదా? మీ అమ్మని చూడు ఎలా ఏడుస్తుంది. నీకు ఏదైనా అయితే మీ అమ్మ బతుకుతుందా?” అని అంటూ బాలు చాకచక్యంగా శివను మాటల్లో పెట్టి.. దగ్గరకు వెళ్లి అమాంతం పట్టుకుని పక్కకులాగి కాపాడతాడు. దాంతో మీనా, పార్వతమ్మ, సుమతీలు ఊపిరి పీల్చుకుంటారు.
శివను దాచిపెట్టిన రాజేష్..
ఆ సమయంలో శివను పట్టుకుని పార్వతమ్మ ఏడుస్తుంటే మనసులు మెలిపడిపోతాయి. మీనా, సుమతి ఇద్దరూ కూడా.. ‘రేయ్ శివ నువ్వు లేకపోతే ఎలారా’ అంటూ ఏడ్చిన తీరు అభిమానుల్ని కంటతడి పెట్టిస్తుంది. ఇక బాలు తీవ్రంగా ఆలోచించి.. ‘శివ ఇక్కడే ఉంటే పోలీసులు తీసుకుని వెళ్లడం పక్కా.. అందుకే వీడ్ని దాచాలి’ అని మీనాతో అని.. మీనాతో పాటు శివను రాజేష్ ఇంటికి తీసుకుని వెళ్తాడు బాలు. జరిగింది అంతా రాజేష్‌కి అతడి భార్యకు వివరించి.. ‘శివను ఇక్కడే దాచాలిరా’ అంటాడు. దాంతో రాజేష్, అతడి భార్య సరే అంటారు. వెంటనే బాలు.. శివ ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి.. ‘ఏం కావాలన్నా రాజేష్ తెస్తాడు.. నువ్వు మాత్రం బయటికి వెళ్లకు శివ’ అని చెప్పి.. మీనాను తీసుకుని అక్కడి నుంచి బయటికి నడుస్తాడు బాలు.
నా వల్లే వీడియో బయటికి వచ్చిందిరా.. సారీ చెప్పిన రాజేష్
ఇక బాలు, మీనాల వెనుకే వచ్చిన రాజేష్.. ‘రేయ్ బాలు.. నాదే తప్పురా.. ఆ వీడియో డిలెట్ చేసేస్తాను అంటే దాచి పెట్టు.. దాన్ని ఉపయోగించే శివను బ్లాక్ మెయిల్ చేసి మంచిగా మార్చొచ్చు అని సలహా ఇచ్చాను.. లేదంటే ఆ వీడియో ఆరోజే నువ్వు డిలెట్ చేసేవాడివి కదా’ అని బాధపడతాడు. దాంతో బాలు.. “ఇలా జరుగుతుందని ఊహించలేదు కదరా.. పాపం శివ ఇప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకో” అంటూ రాజేష్‌కు గట్టిగా చెబుతాడు. “నువ్వేం టెన్షన్ పడకు, శివను నేను జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు చేయాల్సింది ఏదైతే ఉందో అది పూర్తి చేయి. పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా ఉండు” అంటూ బాలుకి సపోర్ట్ చేస్తాడు రాజేష్.
మీనాను అడ్డుకున్నప్రభావతి
ఇక మరోవైపు, బాలు మీనాను తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడు. కారులో వెళ్తున్న సమయంలో మీనా, బాలు చేతిలోకి కొత్త మొబైల్ ఫోన్ ఇస్తూ.. “నీ ఫోన్ పోయిందని నేనే కొత్తది కొనుగోలు చేశాను… కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇస్తానని అనుకోలేదు” అంటూ బాధతో చెబుతుంది. అయితే బాలు మాత్రం వేరే ఆలోచనల్లో మునిగిపోతాడు. “నా ఫోన్ ఎలా పోయింది? ఎవరు తీసుకున్నారు?” అని ఆలోచిస్తుంటాడు. ఎవరో ముందే ప్లాన్ చేసి ఈ వీడియోను బయటపెట్టారని బాలు అనుమానిస్తాడు. బాలు మీనాను తీసుకుని ఇంటికి రాగానే ప్రభావతి అడ్డం నిలబడింది. ప్రభావతి ఆవేశంగా…”ఎంత ధైర్యం నీకు? దొంగల ఇంటి ఆడపిల్లకు ఈ ఇంట్లో చోటు లేదు. మీనా.. వెంటనే బయటకు పో” అంటూ మీనాపై విరుచుకుపడుతుంది.
మీనా తరపున నిలబడి బాలు..
మనోజ్ కూడా “అవును.. ఈ వీడియో వల్ల మేము బయట తలెత్తుకోలేకపోతున్నాం, ఇది అమ్మ ఇల్లు… ఇక్కడ ఎవరు ఉండాలో అమ్మే నిర్ణయిస్తుంది” అంటూ మీనాను అవమానిస్తాడు. వీరి మాటలు నషాళానికి ఎక్కడంతో బాలు విరుచుకుపడుతూ ..”పరువు.. గౌరవం.. దొంగతనం.. ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారా? మనోజ్.. నువ్వు 40 లక్షలు ఇంటి నుంచి దొంగిలించి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు ఏమైంది నీ పరువు? రోహిణీ.. హనీమూన్ టికెట్ల కోసం లక్ష రూపాయలు కొట్టేసినప్పుడు ఎక్కడికి పోయింది నీ గౌరవం? మీనా నగలు అమ్ముకున్నప్పుడు మీ పరువు గంగలో కలిసిందా? ఈ ఇల్లు కూడా దొంగల ఇల్లే.. మీనా కుటుంబం కంటే మీరేం తక్కువ కాదు”అంటూ మీనాకు అండగా నిలుస్తాడు బాలు. బాలు మాటలకు మనోజ్, రోహిణి నోళ్లు మూతపడ్డాయి. ప్రభావతి షాక్‌లో ఉండిపోయింది.
నాన్నా నువ్వు చెప్పు.. నువ్వు మాట్లాడు..
అయినా ప్రభావతి మాత్రం తన నిర్ణయం మార్చుకోకుండా, ‘మీన ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు’ అంటూ గట్టిగా చెబుతుంది. సత్యం మాత్రం మౌనంగానే బాధగానే జరిగేదంతా చూస్తుంటాడు. చూసి చూసి నిస్సహాయంగా అక్కడే కూర్చుంటాడు. దీంతో బాలు ‘నేను ఎవరితో మాట్లాడను… నాన్నతోనే మాట్లాడుతా’అంటూ నేరుగా సత్యం దగ్గరకు వెళ్తాడు. బాలు మాట్లాడుతూ.. “నాన్నా.. శివ దొంగ కాదు. వాడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి వస్తే, అమ్మా వాళ్లు అవమానించారు. ఆ కోపంలోనే డబ్బులు తీసుకున్నాడు. కానీ మరుసటి రోజే ఆ డబ్బులు అమ్మకు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయం అమ్మకు తెలుసు. అయినా పాత వీడియోను బయటపెట్టి రచ్చ చేస్తోంది. ఈరోజు వాడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు నాన్నా”అని బాలు తండ్రికి జరిగింది మొత్తం వివరిస్తాడు. అక్కడితో సోమవారం ఎపిసోడ్ ముగిసింది.