AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి..
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి..
ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
Steel plant Anakapalli
అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో సోమవారం (మార్చి 23) కీలక అడుగుపడింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి చేతుల మీదుగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS India) స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అంచనా. మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని రెండు దశలలో చేపట్టనున్నారు. మొదటి దశలో ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఓ కాప్టివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయనుంది. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాలలో ఈ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అదనంగా 11 వేల 198 కోట్లు కేటాయించనున్నారు. దీని ద్వారా మరో ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం ఎకనమిక్ జోన్.. పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. అలాగే దేశీయంగా ఉక్కు అవసరాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తోంది. అందులో భాగంగా 16వ నంబర్ జాతీయ రహదారిని.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు కలిపేలా నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ అనంతరం శంకుస్థాపన ఫలకం ఆవిష్కరించారు.
‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల...
March 22, 2026