20 ఏళ్లుగా నిమ్స్‌లో డాక్టర్.. లక్ష్మీభాస్కర్ ఆస్తులు రూ.80 కోట్లకుపైనే.. ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు
20 ఏళ్లుగా నిమ్స్‌లో డాక్టర్.. లక్ష్మీభాస్కర్ ఆస్తులు రూ.80 కోట్లకుపైనే.. ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

ఈ ఏసీబీ సోదాల్లో కూకట్పల్లి నుంచి విశాఖపట్నం వరకు పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, బంగారం, కార్లు, బైక్‌లకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా వాటి విలువను లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమికంగా గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.80 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం.
ఏసీబీ సోదాల్లో కూకట్‌పల్లిలోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఇందులో ఒక 4 బీహెచ్‌కే, రెండు 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో మరో ఐదు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్ ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించాయి. విశాఖపట్నంలో సుమారు 800 చదరపు గజాల స్థలం ఉన్నట్లు కూడా సోదాల్లో గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మొత్తం ఆస్తుల విలువ భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.