‘ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి ఒక్కసారైనా ఆలోచించారా’.. సజ్జనార్ ఆగ్రహం
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంతమంది చేసే పిచ్చి పిచ్చి రీల్స్‌పై ఇటీవలి కాలంలో సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. లైక్‌ల కోసం ప్రాణాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చనిపోయిన తర్వాత రీల్స్ ఎవరూ చూడరని.. కుటుంబాలకు మాత్రం తీరని శోకం మిగులుతుందని పేర్కొన్నారు.
Sajjanar
‘ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి ఒక్కసారైనా ఆలోచించారా’.. సజ్జనార్ ఆగ్రహం(ఫోటోలు
సోషల్ మీడియాలో భారీగా సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లను పెంచుకునేందుకు కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. రీల్స్ చేస్తూ వికృత పోకడలకు తెరలేపుతున్నారు. మరికొందరు భయంకరమైన విన్యాసాలు చేసి.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. లైక్స్, షేర్ల కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ.. గాల్లో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ధోరణి ఇటీవల పెరిగిపోతుండటంతో.. యువత రకరకాల విన్యాసాలకు తెరలేపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ .. తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసిన సీపీ సజ్జనార్ .. ఫాలోయింగ్ కోసం యూత్ చేస్తున్న విపరీత పోకడలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాలపై పరుగులు తీస్తున్న రైలులో ఉన్న ఓ యువకుడు.. ఆ రైలు డోరు వద్ద వేలాడుతూ భయంకరంగా స్టంట్లు చేస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక. నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే.. ప్రాణం మీద తీపి కంటే, ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది. ఇలాంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కింది ఏంటి. కేవలం ఆస్పత్రి బెడ్ లేదా అంతిమయాత్రే కదా. మీ పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు ఆగుతారా. ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా. లైకుల కోసం లైఫ్ రిస్క్ చేసేంత పిచ్చి వద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు.. మీ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతుంది’ అని ట్వీట్ చేశారు.
ఇలాంటి చర్యలు చూస్తుంటే యూత్‌కు ప్రాణం మీద ఇష్టం కంటే.. సోషల్ మీడియాలో వచ్చే లైక్‌ల మీద ఆశ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని వీసీ సజ్జనార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత తన పిచ్చి స్టంట్లకు ప్రాణం పోయే వరకు వేచి చూస్తుందా అని నిలదీశారు. వారి కోసం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తారని.. అలాంటి వారి గురించి ఒక్క క్షణం ఆలోచించినా.. ఇలాంటి పనులు చేయరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.