విజనరీ పరశురామ్.. 8ఏళ్ల క్రితమే ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ చూపించేశారుగా!
విజయ్ దేవరకొండ–రష్మిక మందానాల “విరోష్” పెళ్లి వార్తలతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది.
ఉదయ్‌పూర్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహ వేడుక అభిమానుల్లో భారీ ఆసక్తి రేపింది. ఇదే సమయంలో 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలోని పెళ్లి సీన్ మళ్లీ వైరల్ అవుతోంది. “తెల్ల తెల్ల వారే…” పాటలో విజయ్ ఊహలో రష్మికకు తాళి కట్టే సన్నివేశాన్ని నెటిజన్లు షేర్ చేస్తూ దర్శకుడు పరశురామ్‌ను విజనరీగా ప్రశంసిస్తున్నారు. అప్పట్లో బ్లాక్‌బస్టర్ అయిన ఈ చిత్రం, ఇప్పుడు ఈ జంట నిజ జీవిత పెళ్లితో మళ్లీ ట్రెండ్‌లోకి రావడం విశేషంగా మారింది.
Geetha Govindam Marriage Viral on Social Media
విజయ్ దేవరకొండ–రష్మిక మందానా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న “విరోష్” వివాహం గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక మూడు రోజుల పాటు సాగింది. ఫిబ్రవరి 24 నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పూల్ పార్టీలు, కాండిల్ లైట్ డిన్నర్లు వంటి ప్రత్యేక ఈవెంట్లతో పెళ్లి వేడుకకు గ్లామర్ టచ్ ఇచ్చారు. విదేశీ సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ప్రైవసీకి పెద్దపీట వేశారు. మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించేందుకు ఈ జంట ప్లాన్ చేసినట్లు సమాచారం. అభిమానులు ప్రేమగా పిలిచే “విరోష్” అనే పేరునే ఈ జంట తమ పెళ్లికి అధికారికంగా వినియోగించడం విశేషం.
ఇదిలా ఉండగా, ఈ పెళ్లి వార్తల మధ్య సోషల్ మీడియాలో మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ ఊహలో వచ్చే పెళ్లి సీన్‌ను నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. “తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా…” పాటలో రష్మికను వధువుగా ఊహిస్తూ, ఆమెకు తాళి కట్టే సన్నివేశాన్ని దర్శకుడు పరశురామ్ ఎంతో రొమాంటిక్‌గా చిత్రీకరించారు. ఇప్పుడు నిజంగానే ఈ జంట పెళ్లి పీటలెక్కడంతో, అప్పుడే ఈ సంఘటనను ముందే ఊహించినట్లు చూపించిన పరశురామ్‌ను నెటిజన్లు “విజనరీ డైరెక్టర్” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ పెళ్లి సీన్ క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.