హైదరాబాద్: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం, హోటళ్లకు సప్లయ్..!
హైదరాబాద్: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం, హోటళ్లకు సప్లయ్..!
హైదరాబాద్ మంగళ్‌హాట్ కేంద్రంగా సాగుతున్న భారీ ఆహార కల్తీ దందాను టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. జమ్మూ కశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ కోసం గాలింపు చేపట్టారు.
హైలైట్:
హైదరాబాద్‌లో 10 టన్నుల కుళ్లిన మాంసం పట్టివేత
బిర్యానీ తయారీకి చనిపోయిన గొర్రెల మాంసం
కుళ్లిన మాంసాన్ని కెమికల్స్‌తో తాజాగా మార్చి విక్రయం
Hyderabad Meat Scam
హోటల్‌కు వెళ్లి మటన్ బిర్యానీ, పాయా, తలకాయ కర్రీ వంటివి ఆర్డర్ చేసుకొని ఇష్టంగా తింటున్నారా..? మీరు తినేది ఫ్రెష్ మటనా..? లేక రోజుల తరబడి నిల్వ ఉంచిన కుళ్లిన మాంసమా..? అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఎందుకంటే.. తాజాగా హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద ఆహార కల్తీ దందా బట్టబయలైంది. మంగళ్‌హాట్ కేంద్రంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టును గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ టీం రట్టు చేసింది. మెరుపు దాడుల్లో భారీగా మాసం నిల్వలు బయటపడ్డాయి. అక్కడి దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
రెండు భారీ గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 10 టన్నుల అంటే 10 వేల కేజీల కుళ్లినన మేక , గొర్రె మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను, గొర్రెలను అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు నగరానికి తెప్పిస్తున్నట్లు విచారణలో తేలింది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మాంసాన్ని నిల్వ చేస్తూ.. కెమికల్స్‌తో తాజాగా మార్చి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్లిపోయి, బూజు పట్టిన స్థితిలో ఉన్న తలకాయలు, కాళ్లు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు అఫ్రోజ్ ప్రస్తుతం పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాంసం కొనేముందు, హోటళ్లలో తినే ముందు వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మెహిదీపట్నంలో కల్తీ ఐస్ క్రీం దందా రట్టు
ఇక మెహిదీపట్నం పరిధిలోని అహ్మద్ నగర్, ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఆలియా ఐస్ క్రీమ్ పార్లర్‌లో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, మెహిదీపట్నం పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాణ్యత లేని ముడి పదార్థాలు, ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వినియోగదారులకు, ముఖ్యంగా పిల్లలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన ఐస్ క్యాండీలు, లస్సీ ప్యాకెట్లు, తయారీకి వాడే యంత్రాలు, ప్యాకింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.