ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే
ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే
Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బెల్ట్ షాపును కూడా ఊరిలో నుంచి తీసివేయించారు.
హైలైట్:
పోలవరం జిల్లాలోని గూడూరులో నిబంధనలు
ఐస్‌క్రీమ్ బండ్ల రాకూడదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా
Ice Cream Banned In A Village
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండ్లు వెళితే జరిమానా
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. ఐస్‌క్రీమ్‌లకు గిరాకీ పెరిగింది. ప్రతి రోజూ గ్రామాల్లో ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తూ బండ్లు తిరుగుతుంటాయి.. పిల్లలు కూడా ఆ ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఓ ఊరిలో మాత్రం ఐస్‌క్రీమ్ బండ్లు వెళితే జనాలు ఒప్పుకోరు. ఒకవేళ ఎవరైనా ఐస్‌క్రీమ్ బండ్లతో గ్రామంలోకి వస్తే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఊళ్లో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఐస్‌క్రీమ్ బండ్లను గ్రామంలోనికి రానీయకపోవడానికి ఓ కారణంగా ఉందని చెబుతున్నారు.
పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరుకు చెందినవారు తమ ఊళ్లోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదంటూ నిషేధం విధించారు. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ఊరిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామంలో మద్యం బెల్ట్ షాపు ఉండేది.. స్థానికులు, ఊరి పెద్దలు కలిసి ఆ షాపును తీసివేయించారు. అయితే తాజాగా ఐస్‌క్రీమ్ బండ్లపై కూడా ఊరి పెద్దలు ఓ తీర్మానం చేశారు. దీని వెనుక ఓ మంచి కారణమే ఉందని చెబుతున్నారు. ప్రజలు, పిల్లల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలో ఐస్‌క్రీమ్‌లు విక్రయించడానికి వస్తే రూ.5వేలు జరిమానా తప్పదని గ్రామ పెద్దలు, స్థానికులు హెచ్చరించారు.
కొంతమంది ఐస్‌క్రీమ్‌ను సొంతంగా తయారు చేస్తున్నారు.. వాటిని బండ్లలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఐస్‌క్రీమ్‌లు తిన్న పిల్లలకు దంత, జీర్ణపరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట.. ఆ భయంతోనే గ్రామంలోకి ఐస్‌క్రీమ్‌లు రాకుండా నిషేధం విధించామని స్థానికులు చెబుతున్నారు. వీరు తయారు చేసే ఐస్‌క్రీమ్‌లలో ఏ పదార్థాలు, రసాయనాలు కలుపుతున్నారో తమకు తెలియదని.. ఊరిలోని పిల్లల ఆరోగ్యం కోసం గ్రామ పెద్దలు వారం క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద గ్రామంలో పిల్లల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టకుని గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి స్థానికులు కూడా మద్దతు తెలిపారట. గూడూరు ఊరి పెద్దలు, ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.