ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
హైలైట్:
ఏపీ ప్రజలకు తీపి కబురు
క్యూలో నిలబడే పనిలేదు
ఫోన్ ద్వారా హాస్పిటల్ ఓపీ తీసుకోవచ్చు
Mana Mitra WhatsApp
ఏపీ ప్రభుత్వం పేదలకు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవ వ్యవస్థ ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఇక నుంచి ఆరోగ్య సేవలు కూడా పొందవచ్చు. ఈ నంబర్‌కు వాట్సప్‌లో ‘Hai’ అని మెసేజ్ చేస్తే చాలు.. పొందాల్సిన ఆరోగ్య సేవల మెనూ డిస్ప్లే అవుతుంది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్ సేవలు (ఓఆర్ఎస్)ను ఎంచుకుంటే.. సంబంధిత జిల్లా, ఆసుపత్రి, విభాగం, తదితర ఆప్షన్లు కన్పిస్తాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, అడ్రస్, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం తదితర వివరాలు సమర్పించాలి. ఈ ప్రక్రియ తర్వాత టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు నంబర్లు నమోదు చేస్తే.. హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. దాని ఆధారంగా కేటాయించిన సమయంలో హాస్పిటల్ వెళ్లి వైద్యసేవలు పొందొచ్చు. ఇప్పుడున్న పద్దతిలో రోగి లేదా రోగి బంధువు ఆసుపత్రికి వెళ్లి ఓపీ టోకెన్ కోసం వరుసలో నిల్చోవాలి. డాక్టర్లను సంప్రదించాక మందుల కోసం మరోసారి క్యూలైన్లో నిల్చోవాలి. పైగా వెళ్లిన రోజు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటు, మందుల లభ్యతపై సరైన సమాచారం లేకపోతే హాస్పిటల్ వెళ్లినా, పని కావటం లేదు. ఈ విధానం ద్వారా ఆ సమస్యలకు చెక్ పడనుంది.
మన మిత్ర వాట్సప్‌లో ఆరోగ్య కార్డు సేవలు అనే ఆప్షన్ ఎంచుకుంటే.. అందులో ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు కనిపిస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్డేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్డేషన్ కోసం ఫిర్యాదు నమోదు చేసి, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్, ఆరోగ్య సేవల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా భద్రపరిచే ప్రక్రియను తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ‘నో యువర్ ఆభా’ ఆప్షన్ ఎంచుకుని, మొబైల్, ఆధార్ నంబర్లు నమోదు చేయగానే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదుచేసి లాగిన్ కాగానే.. రోగి పేరు, వయసు, ఆభా సంఖ్య, అడ్రస్ ప్రత్యక్షమవుతాయి. ఏ హాస్పిటల్ నుంచైనా, ఎక్కడి నుంచైనా ఆరోగ్య సేవలు పొందాలనుకునేవారు 14 అంకెల ఆభా సంఖ్యను పొందే వీలును కల్పించారు.