ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

 ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్‌ మొత్తం గాలించి.. అక్కడ ఏమీ లేదంటూ తేల్చారు. దీంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

హైలైట్:

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు

ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చిన పోలీసులు

Bomb Threats

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్.. అందర్నీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉన్నట్లు ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్‌తో అక్కడ ఉన్న సిబ్బందితోపాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్‌ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్‌ను పోలీసులు రంగంలోకి దింపారు.

దీంతో ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. స్టేషన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని అణువణువూ గాలింపు చేపట్టారు. స్టేషన్‌లో అనుమానం వచ్చిన ప్రతీ చోట క్షుణ్ణంగా పరిశీలించారు. సామాన్లు, బ్యాగులు, టిఫిన్ బాక్సులు ఇలా చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మెట్రో స్టేషన్‌లో రెండువైపులా ఫ్లాట్‌ఫామ్‌లపై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ ముమ్మరంగా తనిఖీలు చేసింది.

మెట్రో స్టేషన్‌లోని డస్ట్ బిన్లు, పార్కింగ్, టికెట్ కౌంటర్ల వద్ద సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా.. ప్రయాణికులను హుటాహుటిన మెట్రో స్టేషన్ నుంచి బయటికి పంపించేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లను కూడా కొద్దిసేపు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే పూర్తిగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్.. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో బాంబు లేదని తేల్చారు. దీంతో మెట్రో ప్రయాణికులతోపాటు సిబ్బంది, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మెట్రో స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదని తేల్చి చెప్పారు. ఎవరో ఆగంతకుడు ఫోన్‌ చేసి.. కావాలనే ప్రజలను భయాందోళనలకు గురి చేసేందుకు ఈ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది తెలుసుకునేందుకు.. పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే ఇలాంటి బాంబు ఉందంటూ ఫేక్ కాల్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు.

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఈ బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో.. అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో అంతా ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని గుర్తించడంతో.. హైదరాబాద్ నగరంలో భయాందోళనలు రేపేందుకు కావాలనే ఎవరో ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *