అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం..
అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం..
ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కానున్నారు. బుధవారం జరిగిన ఏపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ గైర్హాజరు కానుంది.
హైలైట్:
ఆగస్ట్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈసారి కూడా సమావేశాలకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు
మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ెఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుజరగనున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, అజెండా ఏమిటనే దానిపై.. ఆగస్ట్ 17వ తేదీ నిర్వహించే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ నేతలకు సూచించారు.
అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ.. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును వైసీపీ ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం వివరాలను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశాల్లో వెల్లడించారు. డీఎస్సీ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందన్న బొత్స సత్యనారాయణ.. చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలన్న బొత్స.. 40 శాతం ఓట్లు సాధించిన వైసీపీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించడం లేదని.. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని విమర్శించారు. మరోవైపు ఈసారి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిల్లాల అభివృద్ధి, అమరావతి, మెగా డీఎస్సీ, పరిశ్రమలు- పెట్టుబడులు, భోగాపురం విమానాశ్రయం వంటి అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది.