HR ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంటికి బయల్దేరిన 23 ఏళ్ల భావన.. కోదాడ బస్సు ప్రమాదంలో దుర్మరణం
HR ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంటికి బయల్దేరిన 23 ఏళ్ల భావన.. కోదాడ బస్సు ప్రమాదంలో దుర్
హైదరాబాద్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన 23 ఏళ్ల భావనా వర్ష స్వస్థలం విజయవాడకు బయల్దేరిన ప్రయాణం విషాదంగా ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలోని ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. వారిలో భావనా వర్ష కూడా ఉన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం లారీని బలంగా ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 23 ఏళ్ల భావనా వర్ష కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాద వార్త తెలియగానే భావనా కుటుంబ సభ్యులు కోదాడకు హుటాహుటిన బయల్దేరారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో గాయపడిన పలువురిని కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక కోదాడ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.