హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్.. కొత్తగా 3 స్కైవాక్‌లు.. ఈ జంక్షన్లకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్.. కొత్తగా 3 స్కైవాక్‌లు.. ఈ జంక్షన్లకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా 3 స్కైవాక్‌లు నిర్మించనున్నారు. ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ కొత్త స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ స్కైవాక్ విజయవంతంగా పనిచేస్తుండగా.. మెహదీపట్నంలో ప్రారంభానికి రెడీ అవుతోంది. కొత్త స్కైవాక్‌లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు, కవర్డ్ వాక్‌వేలు ఏర్పాటు చేయనున్నారు.
Hyderabad Skywalks
హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్‌లో విజయవంతంగా అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ స్కైవాక్‌కు నగర ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో.. నగరంలోని మరిన్ని రద్దీ కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. సికింద్రాబాద్, జేఎన్టీయూ జంక్షన్లలో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఐటీ కారిడార్‌లోని ఐకియా జంక్షన్ ప్రాంతాల్లో కూడా కొత్త స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు, వేలాది మంది పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్‌లు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు ఉండటంతో రోడ్డు దాటడం ప్రజలకు పెద్ద సవాలుగా మారుతోంది.
ఈ జంక్షన్లలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పాదచారులకు సురక్షితమైన మార్గాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఐటీ కారిడార్‌లో ప్రతిపాదించిన ఐకియా స్కైవాక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ స్కైవాక్ ద్వారా రాయదుర్గం మెట్రో స్టేషన్‌ను మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, ఐకియా స్టోర్‌తో నేరుగా అనుసంధానించనున్నారు. దీంతో ప్రతిరోజూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ మధ్య రోడ్డు దాటాల్సిన అవసరం లేకుండానే ఆఫీసులకు సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లోనూ మరో స్కైవాక్ నిర్మించనున్నారు. దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్, ఆర్టీసీ బస్ బే, సమీపంలో ఉండే కాలనీలను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నారు. కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలు, షాపింగ్ దుకాణాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నుంచి బిగ్ రిలీఫ్ కలగనుంది.
ఇక మరో స్కైవాక్ ఎల్బీనగర్లో నిర్మించనున్నారు. విజయవాడ, నల్గొండ జాతీయ రహదారులను కలిపే కీలక కూడలే ఈ ఎల్బీనగర్ జంక్షన్. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిరంతరం రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో రోడ్డు దాటడం ప్రమాదకరంగా మారుతోంది. కొత్త స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్, బస్ స్టాండ్, సమీప కాలనీల మధ్య సురక్షిత అనుసంధానం ఏర్పడనుంది. ఈ స్కైవాక్‌లను ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు.
ఎస్కలేటర్లు, లిఫ్టులు, వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పించే కవర్డ్ వాక్‌వేలు, దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక సదుపాయాలు ఈ కొత్త స్కైవేలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు సులభంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్కైవాక్‌ల నిర్మాణంతో పాదచారుల భద్రత మెరుగుపడటమే కాకుండా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రద్దీ తగ్గడం, వాహనాల నిరంతరాయ ప్రయాణం, ఇంధన ఆదా, కాలుష్య నియంత్రణ వంటి ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. మెట్రో, బస్సు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడి నగర రవాణా మరింత సమర్థవంతంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.