భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే నీళ్ల బాటిల్, టీ, రూ.20కే సమోసా.. తక్కువ ధరకే ఫుడ్
Udan Yatri Cafe In Bhogapuram International Airport: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.. అయితే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో కేంద్రం తక్కవ ధరకే ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేయగా.. అక్కడ రూ.10కే నీళ్ల బాటిల్, టీ, రూ.20కే సమోసా అందుబాటులో ఉంటాయి. ఈ ఉడాన్ కేఫ్‌లో నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
హైలైట్:
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ధరకే ఫుడ్
ఉడాన్ యాత్రి కేఫ్‌ను ప్రారంభించారు
రూ.10కే నీళ్ల సీసా, టీ, రూ.20కే సమోసా
Udan Yatri Cafe In Bhogapuram Airport
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఉడాన్ యాత్రి కేఫ్
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సిద్దమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. భోగాపురం విమానశ్రయంలో ప్రయాణికులకు తక్కువ ధరకు టీ, టిఫిన్ అందించేందుకు ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు రూ.10కే నీళ్ల సీసా, టీ, రూ.20కే సమోసా వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. అందుకే ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఎయిర్‌పోర్టులలో ప్రారంభిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన తినుబండారాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రధాని నరేంద మోదీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని భోగాపురం పర్యటనలో పావుగంట పాటు భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ భవనంలో గడపనున్నారు. ఆగస్టు 1న ఉదయం 10.45 గంటలకు ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకుంటారు. ఆయన అనంతరం 11 గంటలకు టెర్మినల్ భవనం వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్ట్ 1న ప్రారంభం అవుతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతిలో కీలక మైలురాయి అవుతుందని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభం అవుతుందని, ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలతో పాటు ఉపాధి, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని కి గిరిజన సంప్రదాయ నృత్యం థింసా, కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే అరకు కాఫీ సహా స్థానిక పర్యాటకానికి బ్రాండింగ్ జరగాలని అన్నారు.