8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు

 8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు

8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు

ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసు, బంధువుల నివాసాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులకు భారీగా అక్రమాస్తుల చిట్టా దొరికింది. భారీగా కమర్షియల్ ప్లాట్లు, వ్యవసాయ భూమి, స్థిరాస్తులు, రూ.లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కీలక పత్రాలు లభించాయి. ఇక మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ACB raids
ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఏసీబీ దాడులు.. అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. భారీగా లంచాలు తీసుకుని.. అవినీతి, అక్రమాస్తులు పెంచుకున్న అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు.. వారి అవినీతి చిట్టాలను బయటికి తీస్తున్నాయి. పక్కా ఆధారాలతో రంగంలో దిగి.. కీలక పత్రాలు, భారీగా అవినీతి సొమ్ము, ఆభరణాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. కొన్ని కేసుల్లో లంచగొండి అధికారులను జైలుకు కూడా పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పైస్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ఏసీబీ వలకు చిక్కడం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి కూడా ఏసీబీ వలలో పడ్డారు.

కొమ్మూరి మల్లారెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. నిజామాబాద్, హైదరాబాద్‌లలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. నిజామాబాద్‌లోని ప్రగతి నగర్‌లో ఉన్న మల్లారెడ్డి అద్దె ఇంటితోపాటు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆఫీస్.. హైదరాబాద్ మచ్చ బొల్లారంలో ఉన్న ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై మొత్తంగా 11 ప్రాంతాల్లో ఒకేసారి 11 మంది టీమ్‌లు దాడులు నిర్వహించాయి. ఉదయం నుంచి లెక్కలు తీసిన ఏసీబీ అధికారులు.. భారీగా ఆయనకు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

కొమ్మూరి మల్లారెడ్డికి 4 ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఒక వాణిజ్య భవనంతోపాటు.. 8 ఖాళీ ప్లాట్లు.. 10.23 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఆయనకు ఉన్నట్లు గుర్తించారు. ఇక మల్లారెడ్డి వద్ద సుమారు రూ.3.31 లక్షల నగదు దొరకగా.. బ్యాంక్ డిపాజిట్ల కింద మరో రూ.50 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై 3 బ్యాంకు లాకర్లు ఉన్నాయని ఏసీబీ తనిఖీల్లో తేలింది.

ఇక కొమ్మూరి మల్లారెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ అక్రమాస్తుల విచారణలో భాగంగా మల్లారెడ్డి, అతడి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న బ్యాంకు లాకర్లను త్వరలోనే తెరవనున్నారు. ఈ సోదాల్లో గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ మార్కెట్‌ విలువ ప్రకారం ఇది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న మల్లారెడ్డిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *