ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు
ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు
New Lv Prasad Eye Hospital In Gudlavalleru: ఏపీలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రులు వరుసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆస్పత్రులు ప్రారంభంకాగా.. తాజాగా మరో ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలు తక్కువ ఖర్చుతో ఆస్పత్రిలో వైద్య సేవలు పొందొచ్చు. ఇకపై కంటి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేదు.
హైలైట్:
ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి
గుడ్లవల్లేరులో శుక్రవారం ప్రారంభిస్తారు
కృష్ణా జిల్లా ప్రజలకు వైద్య సేవలు
AP Lv Prasad Eye Hospital
గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి రెడీ
తెలుగు రాష్ట్రాల్లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి మంచి పేరు ఉంది. తెలుగు రాష్ట్రాలలో కంటి సమస్యలు ఉన్నవారికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న టెస్టులు నుంచి శస్త్రచికిత్సలు వరకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళుతుంటారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ప్రతిరోజూ ప్రజలు వెళుతున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అత్యుత్తమ ట్రీట్మెంట్‌తో పాటుగా తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తారని చెబుతుంటారు. ఏపీ నుంచి జనాలు హైదరాబాద్ వెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. అందుకే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రులు ఏపీలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రారంభించగా.. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ప్రారంభించనున్నారు. దాతల సహకారంతో రూ.7 కోట్లతోఅధునాతన సౌకర్యాలతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శుక్రవారం (మే 1న) ఈ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే పేదలకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. గుడ్లవల్లేరులోని పెంజెండ్ర రోడ్డులో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గతేడాది ఎకరం స్థలంలో ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. గుడ్లవల్లేరుకు చెందిన జాస్తి సుబ్బారావు, పోలవరపు సత్యనారాయణరావుల పేరుతో వారి కుటుంబ సభ్యులు ఈ స్థలం, భవన నిర్మాణ ఖర్చులు మొత్తాన్ని భరించారు. ఆ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన నేత్రవైద్యం, శస్త్రచికిత్సలను అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి కృష్ణాలో తాడిగడపలో ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభించారు. ఇక జిల్లాలో ఎక్కడా మరో ఆస్పత్రి లేదు. గతంలో కౌతవరంలో ఈ ఆస్పత్రి నిర్మించాలని ప్లాన్ చేసినా కుదరలేదు. ఎట్టకేలకు గుడ్లవల్లేరులో ఈ ఆస్పత్రి ప్రారంభంకానుంది. ఈ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పేద, మధ్య తరగతి వారికి కంటి చికిత్సలు, శస్త్రచికిత్సలు ఇక సులభతరం అవుతాయి అంటున్నారు. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా పెదేవగి మండలంలోని వంగూరూలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఉంది.