వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ
వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించారు. నెలకు లక్ష రూపాయల వేతనంతో పాటు మంత్రులకు లభించే ప్రొటోకాల్ సదుపాయాలు ఆయనకు వర్తిస్తాయి. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడంలో వీహెచ్ ఇకపై కీలక పాత్ర పోషించనున్నారు.
హైలైట్:
బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా వీహెచ్
రాష్ట్ర కేబినెట్ హోదాతో కీలక పదవి
జీవో జారీ చేసిన సీఎస్
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా ఆయనను నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు, బీసీ వర్గాలపై ఆయనకున్న పట్టును గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పాలనలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంతో హనుమంతరావుకు ప్రభుత్వం ఉన్నత గౌరవాన్ని కల్పించింది. ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రొటోకాల్ ప్రకారం ఆయన అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రులతో సమానమైన గౌరవం, ప్రాధాన్యత లభించనుంది.
సలహాదారుగా నియమితులైన వీహెచ్‌కు ప్రభుత్వం కల్పించే సదుపాయాల వివరాలను జీవోలో స్పష్టంగా వెల్లడించారు. నెలకు రూ. లక్ష గౌరవ వేతనంతో పాటు ప్రత్యేక అలవెన్సులు ఉన్నాయి. ఆయన ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయిస్తారు. ఒకవేళ స్వంత ఇల్లు లేదా అద్దె ఇంట్లో ఉంటే నెలకు రూ. 50 వేల చొప్పున ఇంటి అద్దె భత్యం చెల్లిస్తారు. సొంత కారు ఉపయోగిస్తే నెలకు రూ. 30 వేలు కన్వేయన్స్ అలవెన్స్, దాంతో పాటు రూ. 15 వేలు ఇంధన చార్జీలు అందుతాయి. అఖిల భారత సర్వీసు అధికారుల (AIS) తరహాలోనే మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది.
సలహాదారు విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిబ్బందిని సైతం కేటాయించింది. ఒక ప్రైవేట్ సెక్రటరీ, ఒక డీఈఓ, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక డ్రైవర్‌తో పాటు నివాసంలో ల్యాండ్ లైన్ ఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడంలో వీహెచ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నియామకం పట్ల బీసీ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి
ఇక తెలంగాణ డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. జీవో నెం. 559 ద్వారా ప్రభుత్వం ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. చీఫ్ సెక్రటరీ హోదాలో మూడేళ్ల పాటు శివధర్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనుండగా.. ఆయనకు నెలకు రూ. 2.25 లక్షల వేతనం అందనుంది. శాంతిభద్రతలు, నేర నియంత్రణ, నార్కోటిక్స్ నియంత్రణలో ప్రభుత్వానికి ఆయన సలహాలు అందించనున్నారు. ఆయన కోసం హోంశాఖ ప్రత్యేక కార్యాలయాన్ని, సిబ్బందిని కూడా కేటాయించింది.