తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి

 తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Mother Kills Baby for Crying for Milk Tirupati

పాల కోసం ఏడుస్తోందని పాపను చంపేసిన తల్లి(ఫోటోలు- Samayam Telugu)
“నా బోసినవ్వులు చూసి మురిసిపోయావ్..
మా ప్రేమకు గురుతుగా పుట్టావని సంబరపడ్డావ్..
మా ఇంటి మహాలక్ష్మి అని ముద్దెట్టుకున్నావ్..
తొమ్మిది నెలలు నన్ను కంటికి రెప్పలా కాపాడిన నువ్వు..
తొమ్మిది నిమిషాలైనా నన్ను భరించలేకపోయావా?
కడుపులో ఆకలేసి, గొంతు తడారిపోయి..

అమ్మ ఒడిలో బజ్జొని గుక్కెడు పాలు తాగాలని ఏడవడమే నా తప్పయ్యిందా అమ్మా?
నా మౌనమే నీకు గుడ్ న్యూస్ అయితే..
పుట్టిన వెంటనే ఏడవకుండా ఉండేదాన్ని..
ఈ ప్రపంచంలోకి రాకపోయేదాన్ని..
నీకు ఇంత చెడ్డపేరు తేనిచ్చేదాన్నే కాదు కదమ్మా..
ఎందుకమ్మా ఇలా చేశావ్?
– చిన్నారి జోషిక

అమ్మ ఒడిలో పడుకుని జోలపాటలు వినాల్సిన ఆరు నెలల చిన్నారి.. అదే అమ్మ చేతిలో కర్కశంగా హత్యకు గురైంది. పాల కోసం ఏడుస్తోందని కన్నతల్లే.. తన బిడ్డ ముక్కు, నోరు మూసేసి ఊపిరి ఆపేసిన దారుణ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో గురువారం ఈ రోజు ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తమిళనాడులోని వెంగలచేరి ప్రాంతానికి వెంకటేష్, హైమావతి భార్యభర్తలు. ఉపాధి కోసం తిరుపతి జిల్లా నరసరాజు అగ్రహారానికి వలస వచ్చారు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ.. సత్యవేడు సమీపంలోని సిమెంట్‌ ఇటుకల తయారీ పనులకు వెళ్తున్నారు. వీరికి ఐదేళ్ల కొడుకు రుత్విక్‌, ఆరు నెలల జోషిక అనే కుమార్తె ఉన్నారు.

గురువారం రోజు (మార్చి 26) ఉదయం ఆరున్నర గంటలు.. జోషికకు ఆకలై.. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్.. భార్యను నిద్ర లేపాడు. బిడ్డకు పాలు ఇవ్వమని చెప్పి.. సిమెంట్ ఇటుకల తయారీ పనికి వెళ్లిపోయాడు. అయితే వెంకటేష్ పనికి వెళ్లిన కాసేపటికే.. ఇంటి వద్ద నుంచి అతనికి ఫోన్ వచ్చింది. అటువైపు భార్య హైమావతి. పాప ఏడుస్తుంటే కోపంలో చంపేశానంటూ గుండెలు పగిలే వార్త చెప్పింది హైమావతి. ఇది మీకు బ్యాడ్ న్యూస్.. నాకు గుడ్ న్యూస్ అంటూ ఫోన్ పెట్టేసింది. అయితే వెంకటేష్ ఇది నమ్మలేదు. కానీ కంగారు కంగారుగా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే చిన్నారి జోషిక ఇంట్లో విగతజీవిగా కనిపించింది. ఇది చూసి తట్టుకోలేకపోయిన వెంకటేష్.. గుండెలు పగిలేలా రోదించాడు. చిన్నారి జోషిక మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మరోవైపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. హైమావతిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆకలేసి పాలకోసం ఏడుస్తున్న బిడ్డపై ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన తల్లిని చూసి స్థానికులే కాదు.. పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆవేశం లో హైమావతి చేసిన పని.. ఆమెకు కడుపుకోతను మిగిల్చింది. ఓ కుమారుడికి తల్లిని.. ఓ తండ్రికి కూతురుని.. ఓ కుటుంబానికి అంతులేని ఆవేదనను మిగిల్చింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *