తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రెండ్రోజుల పాటు వర్షాలు, హెచ్చరికలు జారీ
తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, గత కొన్నిరోజులుగా ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతుండగా.. ఈ వర్షాలు వారికి ఉపశమనం కలిగించనున్నాయి.
హైలైట్:
తెలంగాణకు రెయిన్ అలర్ట్
రెండ్రోజుల పాటు వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
Telangana Weather Updates
భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. గాలులతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు వీస్తున్నాయని.. వీటి కారణంగానే వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న రెండ్రోజులు ఇదే వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక తెలంగాణలో ఈ ఏడాది వేసవి కాలం విభిన్నంగా ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అకాల వర్షాల కలయికతో వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ.. ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు. గత వారం క్రితం నుంచే తెలంగాణ రికార్డు స్థాయి ఎండలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్-నినో ప్రభావం వల్ల ఈ ఏడాది తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని, ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉక్కపోతతో సతమతమయ్యే ప్రజలకు అకాల వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. అవి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉండటంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతినే ఆస్కారం ఉంటుందని ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.