బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్
బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్
హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం వ్యవహారం మున్సిపల్ శాఖలో పెను సంచలనంగా మారింది.
హైలైట్:
బడంగ్‌పేటలో రూ.122 కోట్ల కుంభకోణం
10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు
విలీనం ముందే నిధుల దోపిడీ
Badangpet Municipality
హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం ఉదంతం కలకలం రేపుతోంది. గతేడాది డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన ఈ మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. విజిలెన్స్ విచారణలో వెల్లడైన ఆధారాల ప్రకారం.. డిప్యూటీ కమిషనర్ సహా మొత్తం 10 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానంగా పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల వ్యవహారాల్లో స్కాం చేశారు. బడంగ్‌పేట మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం కావడానికి ముందు.. గత రెండేళ్ల కాలంలో సుమారు రూ.122 కోట్ల నిధులు అడ్డగోలుగా పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా.. కౌన్సిల్ ఆమోదం లేకుండానే, కనీసం ప్రత్యేక అధికారి అనుమతి కూడా తీసుకోకుండా భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినట్లు తేలింది. మున్సిపాలిటీ విలీన ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కీలకమైన రికార్డులను మాయం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు.
డిప్యూటీ కమిషనర్ పి. సరస్వతి, AMC జి. శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి. రఘు, ఎ. యాదయ్య, జ్యోతి, ప్రీ ఆడిట్ ఆఫీసర్ ఎన్. వెంకట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. వినీల్ కుమార్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వై. యాదగిరి, AMC డి. నాగేశ్వర్ రావులను కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. ఒకేసారి 10 మందిపై సస్పెన్షన్ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది.
పింఛన్ మంజూరు లంచం డిమాండ్..
ఓయూ పరిపాలన భవనంలో పింఛన్ మంజూరుకు వచ్చిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి వద్ద లంచం తీసుకుంటున్న ఉద్యోగిని ఏసీబీ అధికారులు బుధవారం (ఏప్రిల్ 1) పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.13 వేలకు ఒప్పందం కుదిరిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించినట్లు చెప్పారు. బాధితురాలి కుమారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో ఓయూ మహిళల హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు చెప్పారు.