నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్
నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్
తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోనుంది.
హైలైట్:
నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త
రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపుల బంద్
పౌల్ట్రీ కంపెనీల తీరుపై యజమానుల ఆగ్రహం
Chicken Price Hike
ముక్కలేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. నిరవధిక బంద్ పాటించనున్నట్లు చికెన్ దుకాణాల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేజీకి రూ.15 నుంచి రూ.20గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కి తగ్గించటంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు.
గతంలో ఉన్న ధరను భట్టే తాము పలు హోటళ్లకు, బల్క్‌గా చికెన్ తీసుకునేవారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుపుతున్నారు. సడెన్‌గా ధరలు తగ్గిస్తే తమకు నష్టం ఉంటుందని చెప్పారు. గతంలో ఇచ్చిన విధంగా పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతకు ముందు హోల్‌సేల్ దుకాణాల్లో హయ్యెస్ట్ లైవ్ చికెన్ ధర రూ.120- 130 ఉండేదని.. ప్రస్తుతం రూ.180- 190 ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 గ్రాముల వేస్టేజ్ పోతే రూ.15 నష్టపోతున్నామన్నారు. అదనంగా ఖర్చు రూ.18 వస్తుందని అన్నీ పోగా తమకు మిలిగేది లేకపోగా.. ఉల్టా జేబుకు చిల్లు పడుతుందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు.
తమ న్యాయమైన డిమాండ్లను పౌల్ట్రీ కంపెనీలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, చికెన్ దుకాణాలు మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్వహరిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. చికెన్ దుకాణాల బంద్‌కు వినియోగదారులు కూడా సహకరించాలని కోరుతున్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎండల తీవ్రత పెరగటం, కోళ్లు చనిపోవటం, సప్లయ్ తగ్గటంతో కేజీ చికెన్ రూ. 300 దాటింది. కొన్ని ఏరియాల్లో అయితే రూ.350-400 మధ్య కూడా పలికింది. అయితే గత వారం చికెన్ ధరలు కాస్త తగ్గాయి. అదే సమయంలో గుడ్ల ధరలు పడిపోయాయి. ప్రస్తుతం కేసు గుడ్లు రూ.132- 140 మధ్య పలుకుతోంది.