జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం
జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిన కొమురక్కపై దాడి జరిగింది. 8 మంది యువకులు.. కొమురక్కపై దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా.. అది అసిస్టెంట్ తీసినట్లు తెలియడంతో గట్టిగా నిలదీసింది. ఇటీవల మరోసారి అడగడంతో.. అతడు తన ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి.. కొమురక్కపై దాడి చేయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Jabardasth Komarakka
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి
జబర్దస్ ఆర్టిస్ట్ కొమురక్కపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. గతంలో కొమురక్క ఇంట్లోనే బంగారం చోరీ చేశాడు. అసిస్టెంట్‌పై అనుమానం వచ్చి కొమురక్క గట్టిగా నిలదీయడంతో.. నిజం ఒప్పుకున్నాడు. దొంగిలించిన బంగారం తిరిగి ఇస్తానని చెప్పి.. కొన్ని రోజులు గడుస్తున్నా.. ఇంకా వెనక్కి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన కొమురక్క.. ఇటీవల మరోసారి అతడ్ని మందలించింది. అది మనసులో పెట్టుకున్న అసిస్టెంట్.. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. మొత్తం 8 మంది కలిసి కొమురక్కను కలిసేందుకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ ఘర్షణలోనే ఆ యువకులు కొమురక్కపై దాడి చేయడంతో.. గాయాలు అయ్యాయి. కొమురక్క ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
కొమురక్క స్వస్థలం అయిన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొమురక్క వద్ద రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామంలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ అసిస్టెంట్‌గా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. అయితే గతంలో ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది. ఇక ఆ బంగారం చోరీ విషయంలో కొమురక్క.. శ్రీనాథ్‌ను గట్టిగా నిలదీయడంతో.. తానే ఆ బంగారాన్ని దొంగించినట్లు నేరం అంగీకరించాడు. పైగా ఆ బంగారాన్ని తిరిగి ఇస్తానని కొమురక్కకు చెప్పాడు.
అయితే రోజులు గడుస్తున్నా దొంగిలించిన బంగారాన్ని శ్రీనాథ్ ఎంతకూ తిరిగి ఇవ్వకపోవడంతో.. 2 రోజుల క్రితం మరోసారి అతడ్ని పిలిచి కొమురక్క మందలించింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనాథ్ తన స్వగ్రామం కాశిరెడ్డిగూడలో ఉన్న ఫ్రెండ్స్‌కు మంగళవారం విషయం మొత్తం చెప్పాడు. దీంతో అదే రోజు రాత్రి 11 గంటలకు మొత్తం 8 మంది కొమురక్క ఇంటికి వెళ్లారు. తాము కొమురక్క ఫ్యాన్స్ అని.. ఫోటో దిగేందుకు వచ్చామని చెప్పి నమ్మించారు. ఈ క్రమంలోనే అందులో ఒక వ్యక్తి.. కొమురక్క దగ్గరికి వెళ్లి.. శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావని గొడవకు దిగాడు.
ఈ గొడవ జరుగుతుండగానే.. మరో వ్యక్తి రాయితో కొమురక్కపై దాడి చేశాడు. అది గమనించి కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుకున్నాడు. దీంతో యాదయ్యపైనా మరో వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఇంకో వ్యక్తి.. కర్రతో కొమురక్కను కొట్టడంతో.. కుడి చేతికి గాయం అయింది. ఈ గొడవను ఆపేందుకు వెళ్లిన మరో వ్యక్తిని నిందితులు రాళ్లతో కొట్టారు. ఈ క్రమంలోనే వారిపై బెదిరింపులకు దిగారు. ఎప్పటికైనా కొమురక్కను చంపేస్తామని హెచ్చరించారు.
ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో కొమురక్క గ్రామస్తులు.. ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బైక్‌లపై వచ్చిన యువకులు.. వాటిని అక్కడే వదిలేసి పారిపోయారు. కొమురక్క స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయగా.. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో వికాస్, చంద్రశేఖర్, వంశీకృష్ణ, గోవా శివ, నరేష్, పోతుల శివ, రామ్‌చరణ్, కిశోర్‌లు ఉన్నారు.