ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్..
ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్..
GHMC Supervisor Pleaded locals Touching Their Feet in Gudimalkapur: రహదారిపై చెత్త వేసేవారిలో మార్పు తెచ్చేందుకు ఓ జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గాంధీగిరి విధానంలో వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే అక్కడకు చేరుకుని రోడ్డుపై చెత్త వేసేవారి కాళ్లు మొక్కుతూ.. ఇలా చేయొద్దని వేడుకున్నారు. గుడిమల్కాపూర్ పరిధిలోని రామ్‌సింగ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
GHMC Supervisor Touching Feet locals
రోడ్డుపై చెత్త వేయవద్దని కాళ్లకు దండం పెడుతున్న జీహెచ్ఎంసీ సూపర్వైజర్
ఇచ్చట మూత్రం పోసినవాడు గాడిద.. ఎదురుగా గోడపై కనిపిస్తూనే ఉంటుంది, కానీ మెల్లగా పనికానిచ్చేస్తాం.. ఇక్కడ వాహనాలు నిలపరాదు.. ఎదురుగా నోపార్కింగ్ బోర్డు ఉంటుంది.. కానీ బండిని ఆపేస్తుంటాం.. ఎక్కడ ఏదైతే చేయకూడదు అని ఉంటుందో.. అక్కడ ఆ పని చేయడమే.. సగటు తెలుగు వ్యక్తి నైజంగా మారిపోతోంది. ఇలాంటి ధోరణికి పాడాలి చరమగీతం అంటే.. అంతకుమించిన క్రియేటివిటీ అవసరం. రూల్స్, జరిమానాలు విధించినా మనోళ్లు లెక్కచేసే రకం కాదు.. అందుకే ఓ జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్ సరికొత్త దారిని ఎంచుకున్నాడు.. అదే గాంధీగిరి..
మహానగరం మేల్కొనకముందే.. తొలి కోడి కూయకుముందే.. చేతిలో చీపురుతో నగరాన్ని సుందరంగా మార్చే పనిలో నిమగ్నమవుతుంటారు జీహెచ్ఎంసీ పారిశుద్ధ సిబ్బంది. సూర్యోదయం కంటే ముందే రంగంలోకి దిగి.. నిన్నటి చెత్తాచెదారపు జ్ఞాపకాలను చీపురుతో ఊడ్చేసి.. ఉషోదయానికల్లా భాగ్యనగరాన్ని సరికొత్తగా ముస్తాబు చేస్తుంటారు. పండుగలు, పబ్బాలు.. వారాలు, రుతువులతో వారికి సంబంధం లేదు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటమే వారి విధి. అయితే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది.. పరిశుభ్రత కోసం ఇంతలా పనిచేస్తుంటే.. కొంతమంది మాత్రం నడిరోడ్డుపై, ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేస్తుంటారు.
కొంతదూరం వెళ్తే చెత్త కుండీలు ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటా చెత్త సేకరణ జరుపుతున్నప్పటికీ.. తమ నైజాన్ని మాత్రం మార్చుకోరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తు్న్న మహేందర్ వినూత్న పంథాను ఎంచుకున్నారు. తెల్లవారుజామున రోడ్డుపై నిలబడి.. రహదారి చెత్త వేయవద్దంటూ ప్రజలను వేడుకున్నారు. కాళ్లకు దండం పెట్టి మరీ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుడిమల్కాపూర్‌లోని రామ్‌సింగ్‌పురాలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోని కొంతమంది పదేపదే రోడ్డు పక్కన చెత్తను పారవేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజూ చెత్తను శుభ్రం చేస్తున్నప్పటికీ, రోడ్డు పక్కన చెత్త పేరుకుపోతూనే ఉంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని భావించిన జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్.. అందుకు గాంధీగిరినే మార్గమని భావించారు..
తెల్లవారుజామునే అక్కడకు చేరుకుని రహదారిపై చెత్త వేసేందుకు వచ్చేవారి కాళ్లు మొక్కుతూ.. మీ కాళ్లకు దండం పెడతా, దయచేసి రోడ్డుపై చెత్త వేయొద్దంటూ వేడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు కూడా జీహెచ్ఎంసీ సూపర్ వైజర్ అంకితభావాన్ని కొనియాడుతున్నారు. స్థానికుల్లో ఇకనైనా మార్పు వస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.