కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు.. ఏపీ వ్యక్తుల ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి: రేవంత్ రెడ్డి

 కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు.. ఏపీ వ్యక్తుల ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు.. ఏపీ వ్యక్తుల ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి: రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు ఎవరివి అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న భారీ విలువైన ఆస్తులు కొద్ది కాలంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా బదిలీ అయ్యాయని నిలదీశారు. కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ఎర్రవల్లి భూములు, ఇతర ఆస్తులపై త్వరలో పార్ట్-2లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని సీఎం తెలిపారు.

Revanth Reddy On KCR Family
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై రేవంత్ రెడ్డి ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సిరిసిల్ల పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తులపై ధైర్యముంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసరాల్లోని కొన్ని హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల యాజమాన్యం, విదేశాల్లో పెట్టుబడులపై కూడా ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు సహా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లెక్కలు తేలుస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబం, బంధువులు, ఆయనకు సంబంధించిన వ్యక్తుల భూములపై సీఎం రేవంత్ రెడ్డి పలు వివరాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దాదాపు 440 ఎకరాల వరకు భూములు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత నెలలోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి భూ లావాదేవీలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టింది.

ఇప్పుడు సిరిసిల్ల సభలో మరోసారి ఆస్తుల అంశాన్ని ప్రస్తావించిన సీఎం.. కేసీఆర్ కుటుంబం తమ ఆస్తులపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని ధనిక ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో ఉన్న కొన్ని స్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారి అనుచరులకు సంబంధం లేదని చెప్పగలరా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. డెక్కన్ సెరాయ్, ఎట్ హోమ్ సర్వీస్ అపార్ట్‌మెంట్లు, సుమారు 400 రూంల హోటళ్ల గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ఆస్తుల వెనుక అసలు యాజమాన్యం, పెట్టుబడుల మూలాలపై ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తానని.. లేకపోతే పేరు మార్చుకుంటానని ముఖ్యమంత్రి సవాల్ చేశారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న భారీ విలువైన భూములు, ఆస్తులు కొద్ది కాలంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా బదిలీ అయ్యాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే వేల కోట్ల విలువైన ఆస్తుల బదిలీలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ లావాదేవీల వెనుక కారణాలు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఎన్ని చిప్పలు కడిగితే ఆస్తులు వచ్చాయంటూ సిరిసిల్లలో కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఇక.. కేసీఆర్ కుటుంబానికి అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా భారీ పెట్టుబడులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విదేశాల్లో పెట్టుబడులు ఉంటే వాటి వివరాలను ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. విదేశీ ఆస్తులు, పెట్టుబడులపై కూడా త్వరలో వివరాలు బయటపెడతానని సీఎం రేవంత్ ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై ఇది కేవలం మొదటి దశ మాత్రమేనని రేవంత్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే పార్ట్-2 పేరుతో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు.

ఎర్రవల్లి భూములు, ఫామ్‌హౌస్‌లు, ఇతర ఆస్తులపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎర్రవల్లి, జన్వాడ వంటి ప్రాంతాల్లో భూ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేపట్టిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తన కుటుంబంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు. ఆరోపణలు రుజువైతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఇరు కుటుంబాల ఆస్తుల వ్యవహారం మరోసారి ప్రధాన చర్చగా మారింది. ఒకవైపు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై మరిన్ని వివరాలు బయటపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుండగా.. మరోవైపు ఆరోపణలకు ఆధారాలు చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రకటించిన పార్ట్-2లో ఏ వివరాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *