మేడారం మినీ జాతర తేదీలు వచ్చేశాయ్.. 4 రోజుల పాటు ఉత్సవాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!
మేడారం మినీ జాతర తేదీలు వచ్చేశాయ్.. 4 రోజుల పాటు ఉత్సవాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!

మినీ జాతరలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. తొలిరోజైన ఫిబ్రవరి 17వ తేదీన మేడారం మినీ జాతర ప్రారంభం కానుంది. తొలి రోజు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఇక రెండో రోజైన ఫిబ్రవరి 18వ తేదీన సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 19వ తేదీన మూడో రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన నాలుగో రోజుతో మినీ మేడారం జాతర ముగియనుంది. ముగింపు కార్యక్రమాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. రెండేళ్లకోసారి మేడారంలో మహాజాతర నిర్వహిస్తారు. మహాజాతర లేని ఏడాదిలో మినీ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహాజాతర సమయంలో భారీగా భక్తుల రద్దీ ఉండటంతో మేడారం చేరుకోలేని వారు, తమ మొక్కులు చెల్లించుకోలేకపోయిన భక్తులు మినీ జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. దీంతో మినీ జాతరకు కూడా భక్తుల నుంచి మంచి స్పందన ఉంటుంది.
సమ్మక్క-సారలమ్మలను ఆదివాసీ గిరిజన దైవాలుగా కొలుస్తారు. మేడారం జాతరలో పూజా కార్యక్రమాలు, అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం వంటి కార్యక్రమాలను ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మేడారం మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో మినీ జాతర కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులను ఆకర్షిస్తుంది.
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు కావడంతో భక్తుల్లో ఆసక్తి మొదలైంది. 2027 ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఇప్పటికే పలువురు భక్తులు మేడారం బాట పట్టనున్నారు.