రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక నిర్ణయం
AP 9 Types Of Ration Card Services In Meeseva Portal: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సహా 9 రకాల సేవల్ని మీ సేవ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీ సేవ పోర్టల్ ద్వారా ఈసేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు
అధికారులు.
హైలైట్:
ఏపీ మీ సేవ పోర్టల్‌లో రేషన్ కార్డు 9 రకాల సేవలు
గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే పని లేకుండా
కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం
AP Ration Card 9 Services
మీ సేవలో రేషన్ కార్డులో మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని జారీ చేసింది. ఒకవేళ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, ప్రస్తుతం ఉన్న కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడి సిబబ్బంది వేర్వేవరు విధులతో బిజీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రకాల రేషన్ కార్డు సేవలను మీసేవ పోర్టల్‌లో అందిస్తోంది. ప్రజలు నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
మీ సేవ పోర్టల్ ద్వారా కొత్త కార్డు తీసుకోవచ్చు, కార్డులో ఉన్న సభ్యుల్ని తొలగించొచ్చు. అలాగే కొత్త సభ్యుల్ని కార్డుల్లో చేర్పులు, కార్డు విభజన, స్వాధీనం, కార్డులో వివరాల మార్పులు, ఆధార్ లింకింగ్, డూప్లికేట్ కార్డు, రేషన్ షాపుల వివరాలు అప్డేట్ చేయడం వంటి తొమ్మిది సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే మీ సేవ పోర్టల్ ద్వారా మార్పులు, చేర్పులు చేయడానికి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆయా సేవలకు సంబంధించిన నిర్ధారణ, ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లి జత చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు, శుభలేఖ, ఆధార్ కార్డు కాపీలు, ఫొటోను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డులో పిల్లలు, కుటుంబ సభ్యులను చేర్చాలంటే బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, ఆధార్ వంటివి ఇవ్వాలి. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ మార్పులు చేర్పులకు ఆధార్ కార్డుతో పాటు మార్కుల లిస్ట్, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జత చేయాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డుకు సంబంధించి ఈ తొమ్మిది రకాల సేవల్ని మీ సే పోర్టల్ ద్వారా పొందాలని సూచిస్తున్నారు అధికారులు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. అర్హులైన వారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.