పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన
‘మీ బండిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా..? అయితే ఈనెల 14న లోక్ అదాలత్‌లో 80 శాతం డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవచ్చు.’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోలపై తాజాగా హైదరాబాద్ సీపీ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని అన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు.
హైలైట్:
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..?
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన
Telangana Fake Traffic Challans
తెలంగాణ ఫేక్ ట్రాఫిక్ చలాన్లు
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనెల 14న రాష్ట్రంలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. ఆ రోజున పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు గొప్ప అవకాశం అంటూ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇన్‌స్టా, ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లలో 80 శాతం వరకు మాఫీ అవుతుందని.. మీ బండిపై 2 వేలు చలాన్లు ఉంటే జస్ట్ రూ.400తో క్లియర్ చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ సువర్ణావకాశం మిస్ కావొద్దని సూచిస్తున్నారు.
అయితే ఈ పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వార్త నిజమైనదేనా..? తాజాగా ఈ వైరల్ వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పారు. పోలీస్ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి డిస్కౌంట్, లోక్ అదాలత్‌లు ప్రకటించలేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొందరు కావాలనే వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేవిధంగా వీడియోలు పోస్టు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. ఫేమస్ అయ్యేందుకు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని.. అలాంటి వీడియోలను ఎవరూ నమ్మెద్దని సూచిస్తున్నారు.
‘సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం. ఇది పూర్తిగా అవాస్తవం. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.’ అని సజ్జనార్ హెచ్చరించారు.